అంగరంగ వైభవంగా బలుసులమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ
తాడేపల్లిగూడెం : తాడేపల్లి గూడెం పట్టణ ఇలవేలుపు బలుసులమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 9.06 గంటలకు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం మంత్రోచ్చారణల మధ్యసాగింది. స్వర్ణయంత్ర, విగ్రహ, శిఖర స్థాపనలు, కళాన్యాసం, దృష్టి గోవు, కుంభ నివేదన, కూష్మాండచ్ఛేదన తదితర పూజలు జరిగాయి. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచి ఆలయం వద్ద వేచి ఉన్నారు. అమ్మవారి పుట్టింటి చీరను పాశం వారి ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఆలయంలో బలుసులమ్మ విగ్రహం ఎదుట ప్రతిష్ట మూర్తిని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికి ముందు శ్రీచక్రాన్ని ఉంచారు. అనంతరం కర్రిగోవుతో దృష్టిగోవు కార్యక్రమం నిర్వహించారు. గోపురంపై శిఖర ప్రతిష్ట చేసి భక్తులు తీసుకువచ్చిన బూరెలను పై నుంచి పోశారు. ఇదే సమయంలో పూర్ణాహుతి జరిగింది. అగ్ని ఉద్వాసన, అవభృదం, బలిహరణ, కంకణ విమోచన కార్యక్రమాలు జరిగాయి.
పారవశ్యంలో భక్తులు
కోర్కెలు తీర్చే కల్పవల్లి, గ్రామ దేవత, పట్టణ ఇలవేలుపు అయిన బలుసులమ్మ వారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. కేరళ సాంప్రదాయ రీతిలో ఆలయాన్ని అలంకరించారు. శివస్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. యీవని సత్యనారాయణ అవధాని, యీవని వెంకట రామాచంద్రరావు, బాదంపూడి ఫణిశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ, వేద ఆగమన పండితులు పర్యవేక్షణలో పూజలు జరిగాయి. దేవాదాయశాఖ జ్యోతిషులు పూజ్యం విశ్వనాథ్, కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి బాబు, శ్రీరంగం సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, వలవల సూరిబాబు, నంద్యాల కృష్ణమూర్తి, వడ్డి రఘురామనాయుడు, పాలడుగు అయ్యన్న, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.