ఎర్రకాలువలో మరో కేజ్‌కల్చర్
ఎర్రకాలువలో మరో కేజ్‌కల్చర్
Published Sat, Mar 18 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
జంగారెడ్డిగూడెం రూరల్ : జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరున్న జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో మరో కేజ్‌కల్చర్ నిర్మాణాన్ని చేపట్టారు. వేగవరంలో నెల రోజుల కిందట రూ.80 లక్షలతో ప్రారంభించిన కేజ్ కల్చర్ నిర్మాణం పూర్తికావచి్చంది. కేకేఆర్ జలాశయంపై చక్రదేవరపల్లి, వేగవరం, జంగారెడ్డిగూడెం, బొర్రపాలెం, సింగరాయపాలెం, ఎ.పోలవరం గ్రామాలకు మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. చక్రదేవరపల్లి సొసైటీపై ఆధారపడిన మత్స్యకారుల కోసం గతేడాది మార్చిలో రూ.80 లక్షలతో కేజ్ కల్చర్ (చేపల పెంపకం) నిర్మాణాన్ని చేపట్టారు. వేగవరం మత్స్యకార సంఘానికి కూడా మరో కేజ్‌కల్చర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దాని నిర్మాణం పూర్తికావచి్చంది. ఇంకా వలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో ఈ కల్చర్‌ను ప్రారంభించి చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేజ్ కల్చర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలు విడిచిపెట్టనున్నామని తెలిపారు.
8 టన్నుల దిగుబడి
2016 మార్చిలో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్‌లో ఇప్పటివరకు రెండుసార్లు చేపలను పట్టారు. 8 టన్నుల వరకు చేపలు వచ్చాయని, వీటికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు వచ్చి కేజ్ కల్చర్‌లో పెరిగిన చేపలను కొనుగోలు చేస్తున్నారు. కేజ్‌కల్చర్ నిర్వహణకు కేటాయించాలి్సన ఖర్చు పోగా వచ్చిన ఆదాయంలో మత్స్యకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. అయితే 30 టన్నుల చేపల వరకు పట్టిన అనంతరం మొత్తం ఆదాయంలో మత్స్యకార సంఘాల అభివృద్ధికి కేటాయిస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్ కల్చర్‌లో వేసిన చేప పిల్లలు పెరగాలంటే 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అయితే ఈ చేప కేజీ పరిమాణం పెరగాల్సి ఉందని ఒక్కో చేప కేజీ వస్తే మంచి దిగుబడితో పాటు ఆదాయం వస్తుందని మొదట్లో అధికారులు చెప్పుకొచ్చారు. కానీ ఈ కేజ్ కల్చర్‌లో రెండు పర్యాయాలు పట్టిన చేపల్లో 400 నుంచి 600 గ్రాముల వరకు మాత్రమే చేపలు పెరిగాయి. ఇక్కడ తిపాఫియా అనే జాతికి చెందిన చేపలను పెంచుతున్నారు.
నేడు మరోసారి పట్టుబడి
ఈ నెల 18న కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద చక్రదేవరపల్లి మత్స్యకార సంఘాల వారి కోసం నిర్మించిన కేజ్ కల్చర్‌లో చేపలు పట్టనున్నామని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈసారైనా పట్టే చేపల్లో కేజీ సైజ్ చేపలు పడతాయా లేక గతంలో మాదిరిగా 500 నుంచి 600 గ్రాముల చేపల పడతాయా అని అటు అ«ధికారులు, ఇటు మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Advertisement
Advertisement