సిట్ అదుపులో మరో వ్యక్తి?
Published Sun, Aug 21 2016 11:26 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
నల్లగొండ క్రైం: నయీమ్ కేసులో ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. నయీమ్‌తో సంబంధాలున్నాయన్న కోణంలో ఐటెన్ న్యూస్ వెబ్ చానెల్ సీఈఓగా పనిచేస్తున్న బి. హరిప్రసాద్‌రెడ్డిని పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సమాచారం. ఆదివారం సిట్ అధికారులు అతనిని విచారించినట్టు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో ఉన్న సంబంధాలతో ఏవైనా భూదందాలు, సెటిల్మెంట్లు చేశాడా? అనే కోణంలో సిట్ పోలీసులు విచారణ చేసినట్టు సమాచారం. అయితే, నల్లగొండలోని హరి నివాసంలో విలువైన భూమి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. నల్లగొండలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ భవనం సెటిల్మెంట్‌తో పాటు గత ఏడాది ప్రకాశం బజార్‌లో వినాయక విగ్రహ ఉత్సవ నిర్వహణతో అతనికి ఉన్న సంబంధాల గురించి సిట్ ఆరా తీసింది. వెబ్ చానెల్ ఏర్పాటు చేసేందుకు సమకూరిన ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి వాటాలున్నాయనే దానిపై కూడా పోలీసులు విచారించారు. అయితే, తాను నయీమ్ పేరు చెప్పి ఎవరినీ బెదిరించలేదని, సెటిల్మెంట్లు చేయలేదని పోలీసుల విచారణలో హరి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, నయీం అనుచరునిగా ఇతర ప్రాంతాల్లో ఏమైనా భూములు కొనుగోలు చేశారా, ఎవరినైనా బెదిరించారా అనే కోణంలో కూడా సిట్ పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లో ఉన్న చానెల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా పోలీసు బృందం పరిశీలించినట్టు సమాచారం.
Advertisement
Advertisement