నయీం దగ్గరి కెళితే ‘క్లిక్’ మనాల్సిందే
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో డొంకలు కదులుతున్నాయి. నయీమ్‌కు నల్లగొండతోపాటు ఇతర జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమే అయినా.. అందుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అవి ఇన్నాళ్లూ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు తాజాగా దొరికిన కొన్ని ఫొటోలు రాజకీయ ప్రకంపనలను సష్టించేలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నయీమ్‌తో కలిసి ఉన్న ఆ ఫొటోలను చూసి దర్యాప్తు వర్గాలు విస్తుపోయాయని సమాచారం. ఎమ్మెల్యేగా ఉంటూ అంత దర్జాగా నయీమ్‌తో ఎలా ములాఖత్ అయ్యాడు.. ఎందుకు భేటీ అయ్యాడనే కోణంలో దర్యాప్తు వర్గాలు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
నల్లగొండ జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులకు కూడా నయీమ్ పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూర్చాడని, అయితే ఆ ఎమ్మెల్యేను హతమార్చాలన్న ఆలోచనతోనే నయీమ్ వారికి ఈ లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారానికి తోడు మరో ఎమ్మెల్సీకి సంబంధించిన ఆధారాలు కూడా దర్యాప్తు వర్గాలకు లభించాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను నయీమ్ కేసులో అరెస్టు చేశారు. జిల్లా నేతలకు నయీమ్‌తో ఉన్న లింకులు ఒకొక్కటిగా బయటపడుతుండడంతో దర్యాప్తును పక్కతోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం కలిగించారని చెబుతున్నారు.
చాయ్ తాగుతూ.. టిఫిన్ చేస్తూ..
నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నయీమ్‌ను వ్యక్తిగతంగానే కలిశాడన్న ఆధారాలు పోలీసులకు లభించాయి. ఓసారి చాయ్ తాగుతూ, మరోసారి టిఫిన్ చేస్తూ... ఇంకో రెండుసార్లు కూర్చుని మాట్లాడుతూ ఉన్న నాలుగు ఫొటోలు దర్యాప్తు వర్గాలకు లభించాయి. షాద్‌నగర్ డెన్‌తో పాటు మరో రెండు చోట్ల నయీమ్‌ను కలిసినప్పుడు ఈ ఫొటోలు తీశార ని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. షాద్‌నగర్ డెన్‌కు సాధారణంగా ఎవరినీ అనుమతించని నయీమ్ ఈ ఎమ్మెల్యేను ఎలా అనుమతించాడు? ఎందుకు అనుమతించాడనే కోణంలో దర్యాప్తు వర్గాలు సీరియస్‌గా విచారణ చేస్తున్నాయి.
పలువురు అరెస్టు
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి నయీమ్‌తో సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలిందని, మొదట్నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్సీ నయీమ్‌తో పలుమార్లు మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా పోలీసుల వద్ద ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను నయీమ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నయీమ్ అనుచరులుగా గుర్తింపు పొందిన వారిలో భువనగిరి జెడ్పీటీసీ సభ్యుడు సందెల సుధాకర్.. నయీమ్ ఎన్‌కౌంటర్ కన్నా ముందే పీడీ యాక్ట్ కేసులో పోలీసులకు లొంగిపోగా, నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్, వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, భువనగిరికి చెందిన కౌన్సిలర్ ఎండీ.నాసర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఎంపీపీలు, కౌన్సిలర్ల వంటి చోటా నేతల అరెస్టుల వరకే పోలీసులు పరిమితం అవుతారా.. లేక నయీమ్‌తో సంబంధాలున్నాయని తేలిన పెద్ద నాయకులను కూడా కటకటాల వెనుక పెడతారా అన్నది వేచిచూడాల్సిందే.
ఎవరైనా ‘క్లిక్’మనాల్సిందే
నల్లగొండ ఎమ్మెల్యేనే కాదు.. నయీమ్‌ను కలిసిన ఎవరి ఫొటో అయినా కచ్చితంగా ఉంటుందని దర్యాప్తు వర్గాలంటున్నాయి. ఎందుకంటే... అది షాద్‌నగర్ డెన్ అయినా...నార్సింగి ఇల్లు అయినా... తుక్కుగూడలో జరిగిన విందు అయినా... నల్లగొండలోని పర్వతగిరి డెన్‌కు వచ్చినా... ఎక్కడైనా సరే నయీమ్‌తో ములాఖత్ అయ్యారంటే ఫొటో క్లిక్‌మనాల్సిందే. నయీమ్‌కు అంగరక్షకులుగా ఉండే యువతుల్లో ఓ అమ్మాయి వద్ద కెమెరా ఉంటుందని, ఆ అంగరక్షకురాలు అటు, ఇటు తిరుగుతూ ఎదుటి వ్యక్తికి తెలియకుండా క్లిక్‌మనిపిస్తుందని, ఆమె డ్యూటీనే అదని పోలీసులంటున్నారు. ఈ ఏర్పాటుతో పాటు నయీమ్ వ్యక్తిగతంగా కలిసే సీక్రెట్ రూంలో ఎవరికీ కనిపించకుండా సీసీ కెమెరాలు కూడా ఉంటాయని పోలీసులంటున్నారు.
నయీమ్ ఎంత మిలిటెంట్ గా వ్యవహరించేవాడంటే....ఎన్‌కౌంటర్ కావడానికి 10 నిమిషాల ముందు కూడా నయీమ్ ఓ పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడాడని, ఓ డీల్‌కు సంబంధించిన నయీమ్ ఒత్తిడి తెచ్చినా ఆ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి అంగీకరించలేదని, ఇదే విషయాన్ని నయీమ్ తన డైరీలో రాసుకున్నాడని పోలీసు వర్గాలంటున్నాయి. ప్రతి విషయాన్ని డైరీలో రాసుకునే అలవాటున్న నయీమ్ తాను ఇతరులతో జరిపిన ప్రతి సంభాషణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేవాడట.