టీడీపీకి మరో షాక్ | another shock to tdp | Sakshi
Sakshi News home page

టీడీపీకి మరో షాక్

Published Wed, Feb 10 2016 2:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీకి మరో షాక్ - Sakshi

టీడీపీకి మరో షాక్

సీఎం సమక్షంలో కారెక్కిన
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్
అదే బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
టీఆర్‌ఎస్ దూకుడుకు ప్రతిపక్షాలు కకావికలం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.ఎం.వివేకానంద గులాబీ గూటికి చేరారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి) సైకిల్ దిగి కారెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా వివేక్ కూడా జంప్ చేస్తుండడంతో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పడిపోయింది. అయితే, మిగిలిన శాసనసభ్యుల్లో ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) కూడా త్వరలోనే టీఆర్‌ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఏకంగా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం సాధించింది.

ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు టీఆర్‌ఎస్, ఒకరు బీజేపీ తరుఫున విజయం సాధించారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య (చేవెళ్ల) కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. కాగా, టీడీపీకి చెందిన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివేక్ కూడా పార్టీకి గుడ్‌బై చెబుతుండడం.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుండడంతో టీడీపీ దాదాపుగా ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా మరింత మంది ఎమ్మెల్యేలపై గులాబీ నాయకత్వం వల విసిరినట్లు తెలుస్తోంది. ప్రకాశ్‌గౌడ్ కూడా మంగళవారం సీఎంను కలుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ, అది వాయిదా పడినట్లు సమాచారం.

 ప్రతిపక్షాలు డీలా!
అధికారపార్టీ దూకుడుకు ప్రతిపక్షాలు కకావికలం అవుతున్నాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తుండడం.. విపక్షాలను నిర్వీర్యం చేస్తుండడం టీడీపీ, కాంగ్రెస్‌లను ఆత్మరక్షణలో పడేసింది. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారోననే అనుమానపు చూపులు వారిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మెజార్టీ తెలుగుతమ్ముళ్లు గులాబీ గూటికి చేరడం.. తమ ఎమ్మెల్యే యాదయ్య కూడా కారెక్కడం కాంగ్రెస్‌ను డైల మాలో పడేసింది. శాసనమండలి ఎన్నికల వేళ మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌పైన కూడా వల విసిరింది. ఆయన చేరిక దాదాపుగా ఖరారైన సమయంలో.. అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డారు. మరోవైపు ఇటీవల గ్రేటర్‌లో పార్టీ ఘోర పరాజయం చవిచూడడం కాంగ్రెస్ నేతలను పునరాలోచనలో పడేసింది.

నైరాశ్యం కూరుకుపోయిన పార్టీలో కొనసాగడం కన్నా, అధికారపార్టీలోకి జంపు చేయడమే మేలనే భావన వారిలో వ్యక్తమవుతోంది. శివారు నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు కూడా పార్టీ మారే అంశంపై సన్నిహిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు వెలుడుతున్నాయి. భారీగా నిధులు వెచ్చించినా కనీసం ఒక డివిజనయినా దక్కకపోగా, దాదాపుగా అన్ని స్థానాల్లో మూడు, నాలుగో స్థానాల్లో నిలవడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పార్టీని వీడే అంశంపై చర్చోపచర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 అందరూ అక్కడికే!
విజేతలు, పరాజితులంతా ఒకే గూటికి చేరుతుండడం సరికొత్త చర్చకు తెరలేపుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రత్యర్థులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటుండడంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. నియోజకవర్గాల్లో ఇప్పటివరకు వైరివర్గాలుగా వ్యవహరించిన నేతాగణం.. ఒకే ఒరలో ఇమడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుత్బుల్లాపూర్‌లో గత ఎన్నికల్లో ఓడిపోయిన కొలను హనుమంతరెడ్డి (టీఆర్‌ఎస్), గెలిచిన వివేక్ (టీడీపీ) ఇరువురు గులాబీ గూటికి చేరారు. అలాగే కాంగ్రెస్‌లో క్రియాశీల నాయకుడిగా వ్యవహరించిన కె.ఎం.ప్రతాప్ కూడా అదే పార్టీ సరసన చేరారు. ఇంకోవైపు ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(టీడీపీ) గతేడాది టీఆర్‌ఎస్‌లోకి మారగా, వైఎస్సార్ సీపీ తరుఫున పోటీచేసిన ఈసీ శేఖర్‌గౌడ్ కూడా అదేపార్టీలోకి వలసవెళ్లారు.

ఆ ఎన్నికల్లో ఓడిపోయిన శేఖర్‌రెడ్డి అధికారపార్టీలోనే కొనసాగుతున్నారు. మహేశ్వరంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి(టీడీపీ) చేతిలో ఓడిపోయిన కొత్త మనోహర్‌రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు. చేవెళ్లలోనూ ఇదే పరిస్థితి. కాలె యాదయ్య(కాంగ్రెస్), కేఎస్ రత్నం(టీఆర్‌ఎస్) కూడా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు(టీడీపీ), ఎం.నర్సింహయాదవ్(కాంగ్రెస్), పద్మారావు (టీఆర్‌ఎస్) ఒకే గూటిలో చేరారు. రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన జ్ఞానేశ్వర్ ఇదివరకే టీఆర్‌ఎస్‌లో చేరగా, తాజాగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా చేరుతారనే ప్రచారం ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement