- నగదు ఉన్నా ఏటీఎంల వరకూ వెళ్లనీయని పలు బ్యాంకులు
- లావాదేవీలపై చార్జీల ఎత్తివేతే కారణం
- ఏటీఎంల వైపే చూడని ప్రైవేటు బ్యాంకులు
- ప్రధాన శాఖలోని ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో నగదు
- 21 రోజులుగా ఇదే దుస్థితి
- అగచాట్లు పడుతున్న ప్రజలు
ఎనీటైం నో మనీ
Published Tue, Nov 29 2016 11:09 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
తమ్ముడు తమ్ముడే...వ్యాపారం వ్యాపారమే అన్నట్లుంది పలు బ్యాంకులు తీరు. పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంలో విత్‌డ్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏటీఎం చార్జీలన్నింటినీ డిసెంబర్ నెలాఖరు వరకు ఎత్తివేసింది. ప్రజలు తమ డెబిట్ కార్డుతో ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉచితంగా ఎన్నిసార్లయినా సేవలు పొందేలా నిర్ణయం తీసుకుంది. అయితే నగదు కొరత చూపిస్తూ పలు ప్రభుత్వ, ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు ఏటీఎంలో నగదు అందుబాటులో ఉంచడం లేదు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఏటీఎం లావాదేవీల చార్జీలు ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆయా బ్యాంకుల ఏటీఎం కేంద్రాల వద్ద ‘నో క్యాష్’ ‘అవుటాఫ్ సర్వీస్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
లావాదేవీకి రూ.14 నుంచి రూ.29 వరకు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014 నుంచి ఏటీఎం లావాదేవీలపై చార్జీలు విధించేలా సర్క్యులర్ జారీ చేసిం ది. అప్పటి వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఏ బ్యాంకు కార్డుతోనైనా ఎన్నిసార్లయినా ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉండే ది. అయితే లావాదేవీలపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ ఏటీఎం లావాదేవీలపై చార్జీలు నిర్ణయించుకునే అధికా రం బ్యాంకులకే అప్పగించింది. పలు బ్యాంకులు ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించి, అవి దాటిన తరువాత తమ సొంత ఖాతాదారుల వద్ద కూడా చార్జీలు వసూలు చేస్తుండగా మరికొన్ని బ్యాంకులు మినహాయింపునిచ్చాయి. అయితే ఇతర బ్యాంకు కార్డుదారులపై మాత్రం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఓ బ్యాంకు కార్డు, మరే ఇతర బ్యాంకు ఏటీఎంలోనైనా నెలలో మూడు లేదా ఐదుసార్లు వరకు చేసే లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఆ పరిమితి దాటిన తర్వాత ఆయా బ్యాంకులు ఒక్కో లావాదేవీకి రూ.14 నుంచి రూ. 29 వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. నగదు విచారణ, మినీ స్టేట్‌మెంట్లకు కూడా రూ.5 నుంచి రూ.10 లెక్కన చార్జీలు వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 31 వరకు ఏటీఎం లావాదేవీలపై చార్జీలు ఎత్తివేడంతో ఆయా బ్యాంకులు ఆదాయం కోల్పోతున్నాయి. దీంతో ఈ తాత్కాలిక నష్టం నుంచి గట్టెక్కేందుకు ఏటీఎంలలో నగదు నింపకుండా నగదు కొరతను సాకుగా చూపిస్తున్నాయి.
ప్రధాన శాఖ ఏటీఎంలోనే నగదు...
రోజువారీ అవసరాలకు చేతిలో నగదులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పలు బ్యాంకులు తమ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో ఆయా బ్యాంకులకు చెందిన 750 బ్రాంచీలున్నాయి. వీటి పరిధిలో 811 ఏటీఎం కేంద్రాలున్నాయి. ఈ నెల 8న పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 10వ తేదీ వరకు ఏటీఎంలు పని చేయబోవని చెప్పారు. అప్పటి నుంచి కూడా 811 ఏటీఎంలలో కేవలం 20 శాతం కూడా పూర్తి స్థాయిలో పని చేయలేదు. క్యాష్ లేదనిపించుకోకుండా పలు ప్రైవేటు బ్యాంకులు కాకినాడ, రాజమహేద్రవరం నగరాల్లో పలు శాఖలున్నా ప్రధాన శాఖ వద్ద ఉన్న ఏటీఎంలలోనే నగదు అందుబాటులో ఉంచుతున్నాయి.
ఏటీఎంల ముందు ప్రజల బారులు
ఏటీఎం విత్‌డ్రాలపై పరిమితి విధించడం, పూర్తి స్థాయిలో ఏటీఎంలు పని పనిచేయకపోవడంతో గత మూడు వారాలు నుంచి ప్రజలు బ్యాంకులు, వాటి వద్ద ఉన్న ఏటీఎంల వద్ద బారులుదీరి ఉంటున్నారు. గత 20 రోజులుగా పనులు కూడా మానుకుని గంటల తరబడి ఏటీఎంల వద్ద నిలబడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఏటీఎంలను రూ. రెండువేల నోట్లను ఉంచినా ప్రజల ఇబ్బందులు చాలా వరకు తీరే అవకాశం ఉంది. కానీ నగదు నింపకుండా నో క్యాష్ బోర్డులు పెడుతున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంలను పూర్తిగా మూసివేస్తుండగా, మరికొన్ని ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయంతో ’ఏటీఎం ఔట్ ఆఫ్ సర్వీస్’ బోర్డులు పెడుతున్నాయి.
Advertisement
Advertisement