
మేల్కొంటేనే ఊపిరి..!
►ఏదైనా అత్యవసరం జరిగితే అంతే సంగతులు
►గతంలోనూ రిమ్స్‌లో ఆక్సిజన్ వ్యవహారంపై రచ్చ
►కొన్ని పీహెచ్‌సీల్లోనే కనిపిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు
►ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిచోట్ల ఉంటేనే ఉపయోగం
►గోరఖ్‌పూర్‌లాంటి ఘోరం జరగకముందే జాగ్రత్తలు అవసరం
గోరఖ్‌పూర్ లాంటి ఘోరం జరగకమునుపే వైద్యారోగ్యశాఖ మేలుకోవాలి. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా.. లేదా? ఉన్నచోట సక్రమంగా పనిచేస్తున్నాయా అనేది పరిశీలించాల్సి ఉంది. ఒక ప్రమాదం జరిగిన తర్వాత అప్రమత్తమయ్యేకంటే ఒక్కసారి అవలోకనం చేసుకుంటేనే మంచిది. ఏళ్ల నాటి క్రితం సిలిండర్లు...ఎంతమాత్రం పనిచేస్తున్నాయన్నది కూడా అనుమానాలకు తావిస్తోంది. అవసరమైనపుడే బయటికి తీయడం, అప్పుడు పనిచేయకపోతే ఆందోళన చెందే పరిస్థితి కంటే ముందే పరిశీలిస్తేనే బాగుంటుందని జనం కోరుతున్నారు.
కడప :రెండేళ్ల క్రితం జిల్లాలో ప్రధాన ఆస్పత్రిగా చెప్పుకునే రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఒకేరోజు ముగ్గురు, నలుగురు చనిపోయిన నేపథ్యంలో వెంటిలేటర్ సిస్టమ్‌తోపాటు ఆక్సిజన్ల సిలిండర్లు పనిచేయకపోవడంతోనే ఘటన జరిగిందని రచ్చ జరిగింది. ప్రస్తుతం అలాంటి పెద్ద సంఘటనలు జిల్లాలో లేకపోవడం ఊపిరి పీల్చుకునే అంశం. జిల్లాకేంద్రమైన కడపలోని రిమ్స్‌తోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ల సిలిండర్లు సంపూర్ణంగానే ఉన్నాయి. కానీ చాలా పీహెచ్‌సీల్లో ప్రాణవాయువు అందుబాటులో లేదు. ఉన్నవాటిల్లోనూ వాటిని వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం కానీ, అత్యవసర కేసులు వస్తే వెంటనే రిమ్స్‌కు రిఫర్ చేస్తున్నారు తప్పించి ప్రాథమికంగా కొద్దిసేపు ఆక్సిజన్ పెట్టి ప్రాథమిక చికిత్స చేస్తున్న దాఖలాలు తక్కువే.
అత్యవసరానికే ముందే అప్రమత్తత అవసరం
జిల్లాలో సుమారు 75 పీహెచ్‌సీలతోపాటు పలు 24 గంటలు పనిచేసే ఆస్పత్రులతోపాటు 30, 50, 100 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. అయితే కేవలం వృద్ధులు, కొంతమంది చిన్నారుల పరిస్థితిని బట్టి ఆక్సిజన్ వినియోగిస్తున్నారు. దీంతో అవసరం కూడా తక్కువగానే ఉంది. కానీ ఏదైనా పెద్దప్రమాదం జరిగితే కష్టమే. ఇటీవలె గోరఖ్‌పూర్‌లోని మెడికల్ ఆస్పత్రిలో చిన్నారులు ఆక్సిజన్ అందక సుమారు 30మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యా«ధికారులు ఎక్కడికక్కడ ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించిన వివరాలతోపాటు వెంటిలేటర్ల సిస్టమ్ గురించి నివేదికలు తెప్పించుకున్నారు. అయితే ఇప్పటివరకు పలు ఆస్పత్రుల్లో చిన్నారులకు సంబంధించిన ప్రత్యేక విభాగాలు ప్రారంభానికి నోచుకోలేదు.
అంతంత మాత్రమే
జిల్లాలోని అన్ని ప్రధాన ఆస్పత్రులతోపాటు పలు పీహెచ్‌సీల్లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ సిలిండర్లలో కొన్ని అంతంతమాత్రంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోం ది. కొంతమంది పీహెచ్‌సీ సిబ్బంది చూసుకోకపోతే సిలిండర్ ఖాళీ అయినా అలాగే ఉండిపోతుంది. అదేవిధంగా కొన్ని లీకై ఆక్సిజన్ బయటికి వెళ్లినా పట్టించుకోని పరిస్థితి. ఆక్సిజన్ సిలిండ ర్లు అయిపోయిన వెంటనే ఆస్పత్రి అభివృద్ధి నిధులతో మళ్లీ సిలిండర్‌కు ఆక్సిజన్ పట్టుకోవాలి. అందుకుగాను రూ.600–800 మధ్య మాత్రమే ఖర్చవుతుంది.
కొన్ని పీహెచ్‌సీలకే పరిమితం
జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా 35చోట్లనే ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాకాకుండా అన్ని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో కూడా తెలియని పరిస్థితి. పెద్దాస్పత్రులను పక్కన పెడితే మారుమూల పల్లెల నుంచి ఎక్కువగా పీహెచ్‌సీలకు రోగులు వెళుతుంటారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కువగా చిన్నారులు, ఆస్తమా రోగులు వస్తుంటారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని అన్ని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచితే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు నేరుగా పీహెచ్‌సీలకు వెళతారు. ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు అత్యవసరంగా అక్కడనే ఆక్సిజన్ పెట్టడానికి అవకాశం ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఆక్సిజన్ సమస్య లేదు
జిల్లాలో 24గంటలు పనిచేసే పీహెచ్‌సీలు దాదాపు 35 వరకు ఉన్నాయి. ఇక్కడ అన్నిచోట్ల ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం! అంతేకాకుండా గర్భిణులు, చిన్నపిల్లలు అధికంగా వచ్చే పీహెచ్‌సీలను కూడా గుర్తించి అక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేశాం!
– డాక్టర్ రామిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి