ఏపీ మంత్రివర్గంలోకి నారాలోకేశ్
చంద్రబాబునాయుడు సంకేతాలు
* అసెంబ్లీ సమావేశాల తరువాత మంత్రివర్గ విస్తరణ
* మరో అధికార కేంద్రం ఏర్పడుతుందనే ఆలోచన
* ఇప్పటి వరకూ వాయిదా వేస్తూ వచ్చిన చంద్రబాబు
* కుటుంబం నుంచి ఒత్తిడితో తప్పని పరిస్థితి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరిక దాదాపు ఖరారైంది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. వివిధ టీవీ చానళ్లకు శుక్రవారం ఇంటర్వ్యూలు ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడంపై సానుకూలంగా స్పందించారు.
పార్టీ కోసం లోకేశ్ బాగా పనిచేస్తున్నాడని, అవకాశం ఇస్తే పైకి వస్తాడని అభిప్రాయపడ్డారు. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా మాత్రమే ఉన్న లోకేశ్ టీడీపీ మహానాడు తరువాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యారు. అంతకు ముందు నుంచే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చేలా బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇటీవలి కాలంలో ఆ ప్రక్రియను వేగవంతం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఐటీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన శాఖలపై పట్టుతోపాటు దేశ విదేశాల్లో పర్యటనల ద్వారా తనకంటూ ఒక ఇమేజ్‌ను పెంచుకుంటున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. రాజకీయ, రాజకీయేతర వర్గాల్లో కేటీఆర్‌కు లభిస్తున్న ఆదరణ బాబు కుటుంబ సభ్యులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ వారు ఎంతోకాలంగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు లోకేశ్‌ను తన కేబినెట్‌లో చేర్చుకునేందుకు అంగీకరించారు.
నేను సానుకూలంగా ఆలోచిస్తున్నా...
చంద్రబాబుకు సాధారణంగా పార్టీలో రెండో అధికార కేంద్రం ఇష్టం ఉండదు. గతంలో రెండో అధికార కేంద్రంగా తయారైన పలువురు బలమైన నేతలను ఏదో ఒక రకంగా బయటకు పంపారు. తన కుమారుడు రెండో అధికార కేంద్రంగా తయారైతే తలనొప్పులు తప్పవని, తన ప్రభావం కొంత తగ్గుతుందనే ఆలోచనలో బాబు ఉన్నప్పటికీ కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడితో తలొగ్గక తప్పలేదని సమాచారం. చంద్రబాబు శుక్రవారం చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ... ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నారు.
లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా? అని ప్రశ్నించగా... దీనిపై ఊహాగానాలు అవసరం లేదని, ఆయన నేరుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. లోకేశ్‌కు అవకాశమిస్తే ఇంకా మంచిగా ఎమర్జ్ అవుతారని అన్నారు. తాను సానుకూలంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. బాబు గతంలో పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు లోకేశ్‌ను ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా పంపితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. లోకేశ్‌ను రాజ్యసభ సభ్యుడిగా చేసి, కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆలోచించా రు. ప్రస్తుతం కేంద్రంతో బాబుకు అంత సఖ్య త లేదు. ప్రతికూల పరిస్థితుల్లో లోకేశ్‌ను ఢిల్లీకి పంపి, ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే సొంత కేబినెట్‌లో చేర్చుకోవడమే మేలనే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.