నలుగురు మంత్రులకు ఉద్వాసన!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆదివారం ఉదయం ఏపీ కేబినెట్ విస్తరణ సందర్భంగా 19మంది మంత్రుల్లో నలుగురిపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఐదుగురు మంత్రులపై వేటు పడుతుందని వార్తలు వచ్చినా... చివరి నిమిషంలో మంత్రి పీతల సుజాత సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో నలుగురిపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పల్లె రఘునాధరెడ్డి, కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిశోర్ బాబు తొలగింపు దాదాఫు ఖరారు అయినట్లే.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంత్రులతో సమావేశం అయ్యారు. అయితే విడతలవారీగా చంద్రబాబు మంత్రులతో భేటీ అవుతున్నారు. మొదటి విడతలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, రావెల కిశోర్ బాబు హాజరు అయ్యారు. కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై ఆయా మంత్రులతో ఏకాంతంగా చర్చించారు. కాగా బొజ్జల గోపాల్‌కృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి గైర్హాజరు అయ్యారు. అనంతరం రెండో విడత మంత్రులతో భేటీ అయ్యారు.
కేబినెట్ భేటీ అనంతరం పలువురు మంత్రులతో రాజీనామాలు చేయిస్తారనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో పలువురు మంత్రుల్లో అలజడి మొదలైంది. తమ మంత్రి పదవిపై వేటు పడుతుందుమో అనే భయం పలువురు మంత్రుల్లో కనిపిస్తోంది. దీంతో ఏపీ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పదవుల కోసం ఆశావహులు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర బలప్రదర్శనకు దిగుతున్నారు. తమ అనుచరులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ...సీఎంను కలిసే యత్నం చేస్తున్నారు. పార్టీ ఎంపీలు, సీనియర్ నేతల ద్వారా పైరవీలు చేస్తున్నారు. మరోవైపు చివరి నిమిషంలో అయినా ఛాన్స్ దక్కకపోతుందా అనే ఆశతో... ఆశావహులు, అసంతృప్తులు విజయవాడలోనే మకాం వేశారు.