
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కేబినెట్‌లో కొత్తగా మరో ఇద్దరు మంత్రులు చేరారు. కొత్త మంత్రులుగా ఎన్‌ఎమ్‌డీ ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్‌లు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాస ప్రజావేదికలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. ఫరూక్ తెలుగులో, శ్రవణ్ కుమార్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిద్దరికి శాఖలను కేటాయించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్‌కు వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీ వెల్ఫేర్ శాఖలను, విశాఖపట్నం జిల్లాకు చెందిన కిడారి శ్రవణ్ కుమార్‌కు గిరిజన సంక్షేమశాఖను కేటాయించారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రులు, పార్టీనేతలు తదితరులు హాజరయ్యారు.
కొన్ని రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన కుమారుడు శ్రవణ్‌కుమార్‌కు కేబినెట్‌లో చోటు కల్పించారు. దాంతో శ్రవణ్‌కుమార్ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందినట్లయ్యింది.