
పోలీసులూ... డేంజర్‌లో పడతారు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం మాటలు విని కొందరు పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం మాటలు విని కొందరు పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే ప్రమాదంలో పడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
తమ ఆస్తిపాస్తుల కోసమో స్వప్రయోజనాల కోసమో ధర్నాలు చేయడం లేదని, ప్రజల ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తుంటే పోలీసులతో అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు విమర్శించారు. టీడీపీ జన చైతన్య యాత్రలకు, మంత్రులు బయట తిరగడానికి పోలీసుల రక్షణ కావాలని, పోలీసులను వాళ్ల డ్యూటీలను చేయడనివ్వడంలేదని మండిపడ్డారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ చూడటం, దొంగలను పట్టుకోవడం, రౌడీయిజం చేసేవారి ఆట కట్టించడం వంటివి చేయాల్సి ఉంటే.. ప్రభుత్వం మాత్రం వారి చేత నీరు-మట్టి, జన చైతన్య యాత్రలు, పుష్కరాలు, మంత్రుల వెనకే తిప్పించుకోవడం వంటివి చేయిస్తోందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో ఓ దళితుడు చేసిన 2500 రూపాయలు అప్పు తీర్చడం ఆలస్యమైందని పోలీసు స్టేషన్‌లో పెట్టి, ఎస్సై ఒకరు ఆయనకు వాతలు పడేలా కొట్టారని, ఈ కేసు గురించి తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు 20 సార్లు వెళ్లినా కలవలేకపోయానని, శ్రీకాకుళం ఎస్పీని కలిసేందుకు ఐదుసార్లు ప్రయత్నించినా కలవడం కుదరలేదని తెలిపారు. ఇది పోలీసుల తప్పు కాదని, టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానమనే కారణమని దుయ్యబట్టారు.