
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్‌లో ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు మధు సోమవారం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మూడు హత్యలను తానే చేసినట్లు అతడు అంగీకరించాడు. పోలీసుల విచారణలో అతడు పలు విషయాలు వెల్లడించాడు. ‘ అపర్ణతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. అయితే ఆమె వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. దాన్ని సహించలేకే హత్య చేశారు. ముందుగా కార్తికేయ, అపర్ణ తల్లి విజయమ్మను గొంతు నులిమి చంపాను. ఆ తర్వాత అపర్ణను గోడకేసి కొట్టి చంపాను.’ అని తెలిపాడు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ .. కూకట్‌పల్లికి చెందిన మధుతో కలిసి చందానగర్‌లో నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది.