హత్యకు గురైన అపర్ణ, విజయలక్ష్మి, చిన్నారి.. నిందితుడు మధు(ఇన్‌సెట్లో)
సాక్షి, హైదరాబాద్: ప్రేమ అన్నాడు. సహజీవనం చేశాడు. ఓ కుమార్తె జన్మకు కారణమయ్యాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం.. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉండటంతో ప్రేమికురాలిని దారుణంగా చంపాడు. కుమార్తెను, ప్రేమికురాలి తల్లిని కూడా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గుడూరి జయమ్మ(50)కు కుమార్తె అపర్ణాదేవి(33), కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు.
అపర్ణ అమ్మమ్మ ఊరు పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. అదే గ్రామానికి చెందిన రావాడ మధు కేపీహెచ్‌బీలో సెల్‌ఫోన్లు రిపేర్ చేస్తుంటాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు పదేళ్ల క్రితం మధుతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే తనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారన్న విషయాన్ని దాచి అపర్ణతో సహజీవనం చేయసాగాడు. వీరికి ఐదేళ్ల వయస్సున్న పాప కార్తీకేయ కూడా ఉంది. చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఎల్‌జీ ప్రమోటర్‌గా పనిచేస్తున్న అపర్ణ ప్రస్తుత ఫ్లాట్‌లో రెండున్నర నెలలుగా తల్లి, కుమార్తెతో కలసి ఉంటోంది.
దుర్వాసన రావడంతో వెలుగులోకి ...
బయట నుంచి తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని నారాయణరావు అనుమానం వచ్చి వెనక వైపు కిటికీలో నుంచి చూశాడు. హత్యకు గురైన అపర్ణ కాళ్లు కనిపించాయి. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కిచెన్‌లో రక్తపు మడుగులో పడి అపర్ణ మృతి చెంది ఉంది. బెడ్‌పై జయమ్మ, కార్తికేయ తనువు చాలించి ఉన్నారు. అపర్ణ తలపై బలంగా కొట్టి చంపినట్టుగా అనవాళ్లు ఉన్నాయని చెప్పిన పోలీసులు చెప్పారు. జయమ్మ, కార్తికేయ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. క్లూస్ టీం, ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. ఘటనాస్థలిని సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పరిశీలించారు. షానవాజ్ ఖాసీమ్ మాట్లాడుతూ ‘అపర్ణను తలపై రోకలిబండతో మోది కిచెన్‌లో హత్య చేశారు. బెడ్‌పై పడుకున్న జయమ్మ, కార్తికేయను గొంతుకు పిసికి చంపి ఉండొచ్చు. లేదంటే విషమిచ్చి చంపి ఉండవచ్చ’న్నారు. హత్య చేసిన అనంతరం బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయాడన్నారు.
సీసీటీవీ కెమెరాల పరిశీలన...
హత్య ఎప్పుడు, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేముకుంటలోని ఫ్లాట్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అపర్ణ సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి శనివారం 2.48 గంటలకు విధుల్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డయింది. భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అపర్ణ రాకపోవడంతో 3.30 గంటలకు సహచర ఉద్యోగి ఫసీయుద్దీన్ ఫోన్ చేయగా కలవలేదు.
రెండు నెలలుగా గొడవ...
అపర్ణతో సహజీవనం చేస్తున్న మధు తరచూ వేముకుంటలోని నివాసానికి వస్తుండేవాడు. అయితే, అపర్ణను వదిలేయంటూ మొదటి భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, అదే సమయంలో పెళ్లి చేసుకోవాలంటూ అపర్ణ కూడా బలవంతం చేస్తుండడంతో ఇద్దరి మధ్య రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. అయితే, అపర్ణతో తాను సహజీవనం చేస్తున్నానని, మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. శనివారం మధ్యాహ్నం అపర్ణ ఇంటికి రాగానే తలుపు తీశానని, వెంటనే ఆమె తలను గోడకేసి బాది చంపానని నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment