గ్రాఫిక్స్‌తో సినిమా చూపించారు...
► గ్రాఫిక్స్‌కే పరిమితమైన 60 అంతస్తులు
► హైరైజ్ భవనాలపై ప్రభుత్వం వెనకడుగు
► కమర్షియల్ జోన్‌లోనూ జీ+11కే అనుమతి
► సీఆర్‌డీఏ ఆమోదిస్తేనే15 నుంచి 18 అంతస్తులు
విజయవాడ బ్యూరో: రాజధానిలో ఆకాశహర్మ్యాల (హైరైజ్) నిర్మాణం అంతా హంబక్కేనని తేలిపోయింది. ఈ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. సింగపూర్, చైనా తరహాలో ఇక్కడా భారీ ఎత్తున ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని మొదట్లో హడావుడి చేసి రకరకాల రంగుల బొమ్మలను చూపించినా.. చివరికి 15 నుంచి 18 అంతస్తులతోనే సరిపెట్టుకుంటోంది. ఆ మేరకు జోనింగ్ మార్గదర్శకాలూ రూపొందించడంతో మాస్టర్‌ప్లాన్‌లో చూపించిన 50, 60 అంతస్తుల భవనాలు కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితమయ్యాయి. సచివాలయాన్ని 60 అంతస్తుల్లో నిర్మించడానికి ఒక దశలో సీఆర్‌డీఏ కసరత్తు చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన తర్వాత అక్కడి ఆకాశహర్మ్యాలను చూసి అదేమాదిరిగా అమరావతిలో భారీ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. వివిధ దేశాలల్లో పర్యటించిన సీఆర్‌డీఏ, ప్రభుత్వ ఉన్నతాధికారులు.. ఆధునిక నగరాలు నిట్టనిలువుగా (హైరైజ్) పెరుగుతున్నాయని, ఇక్కడా అదే మోడల్‌ను అనుసరిస్తామని చెప్పారు. తీరా అమరావతి ప్రాంతంలోని భూమిలో గట్టిదనం లేనందువల్ల బహుళ అంతస్తుల నిర్మాణం సరికాదని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వానికి వెనకడుగు తప్పలేదు. చేసేదేమీలేక తక్కువ అంతస్తుల నిర్మాణాలకే పరిమితమై అందుకనుగుణంగా జోనింగ్ మార్గదర్శకాలు రూపొందించింది. వీటిప్రకారం రెసిడెన్షియల్ జోన్లలో జీ+11 నిర్మాణాలకే అనుమతిస్తారు. అది కూడా ఆర్-3, ఆర్-4 జోన్లలో మాత్రమే. కమర్షియల్, ఇన్‌స్టిస్ట్యూషనల్ జోన్లనూ జీ+11 నిర్మాణాలకే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరమైతే సీఆర్‌డీఏ కమిషనర్ ఆమోదంతో 15 నుంచి 18 అంతస్తులకు అనుమతించే అవకాశం ఉంటుంది.
నిపుణులు హెచ్చరించినా..
అమరావతిలో నేల సామర్థ్యం బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుకూలం కాదని మొదటి నుంచి నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం గ్రాఫిక్స్ చేయించింది. అమరావతి ప్రాంతమంతా ఒండ్రుమట్టి (అల్లువియల్), వదులు (లూజ్) మట్టితో ఉంది. ఇక్కడి భూమిలో పది నుంచి 15 అడుగుల లోతులోనే నీళ్లు పడతాయి. ఈ నేలలకు సాయిల్ బేరింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ముందు సీఆర్‌డీఏ ఈ ప్రాంతంలో ఎనిమిది చోట్ల భూ పరీక్షలు నిర్వహించినా వివరాలను బయటపెట్టలేదు.
కొందరు రైతులు భూమి పరిస్థితి తెలుసుకునేందుకు లెసైన్స్‌డ్ సంస్థతో భూపరీక్షలు చేయించగా ఈ ప్రాంతం బహుళ అంతస్తులకు అనువైంది కాదని తేలింది. ఈ అనుమానంతోనే జీ+7 తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 60 అడుగుల లోతు, మూడున్నర అడుగుల వెడల్పుతో పునాది వేయిస్తోంది. ఈ స్థాయి పునాది 120 అంతస్తులకు వేస్తారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. పైకి ఎంత బకాయిస్తున్నా లోలోన అనేక అనుమానాలుండడంతో ప్రభుత్వం భారీ పునాది వేయిస్తోందంటున్నారు.