రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం
రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం
Published Wed, Aug 24 2016 6:03 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
కోడెల గెలిచిన తర్వాతే ఈ దుస్థితి..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట: డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ్యుడిగా గెలిచి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. స్పీకర్ కోడెల మాటలు విని.. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆయనకు,ఆయన కుమారుడికి గుండాలుగా పని చేయటం ప్రమాదకరమైన విషయమన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌పై దౌర్జన్యం కేసులో ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకున్నారంటే ఆయనే ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడికుడి– శ్రీకాళహస్తి పనులు చేస్తున్న రైల్వే కాంట్రాక్టర్, ఆయన మనుషులు, కూలీలపై స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు పంపిన గుండాలు దాడిచేసి ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేస్తే, వారిపై మరో కౌంటర్ కేసును నమోదుచేయటం దారుణమన్నారు. ఈ సంస్కృతి కోడెల శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి ఉందని, తెలుగుదేశం వారు ఎవరినైనా కొడితే కేసు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తిపైనే కేసు పెట్టి బెదిరించి రాజీచేసే ప్రక్రియకు పాల్పడుతున్నాన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో, సత్తెనపల్లి, నరసరావుపేటల్లో శాంతిభద్రతలు ఏవిధంగా రక్షించబడతాయో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోడెల గెలిచిన తర్వాత సత్తెనపల్లిలో పోలీసులే గుండాలుగా వ్యవహరించి తమ పార్టీ ఎంపీటీసీలను అపహరించుకెళ్ళారన్నారు. సత్తెనపల్లిలోని వెన్నాదేవి దగ్గర పోలీసులకు ఏవిధమైన సంబంధంలేకపోయినా ఒక స్థలం వద్దకు వెళ్ళి ఆ స్థల యజమానిని భలవంతంగా ఖాళీచేయించిన తర్వాత కోడెల శివప్రసాదరావు గుండాలు ప్రవేశించారన్నారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ప్రజల మానప్రాణాలను రక్షించటానికంటే కోడెల, అతని కుమారుడికి ఖాకీ డ్రస్సు వేసుకున్న గుండాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇది సమాజానికి,. పోలీసులకు మంచిది కాదన్నారు. కమిషన్ లేనిదే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ ఏ పనిచేసే పరిస్థితిలేదన్నారు. మొన్న స్పీకర్‌ను లోకేష్ కలిసిన తర్వాత కాంట్రాక్టర్‌పై దౌర్జన్య వ్యవహారం చోటుచేసుకుందన్నారు. లోకేష్, స్పీకర్, చంద్రబాబులు ఇప్పటికే ప్రజలను దోచుకుంటున్నారని, అయితే ఇంత దౌర్జన్యంగా ఇక్కడ దోచుకోవటం జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
అంతా కోడెల కుమారుడి లీల..
ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ సంగం డెయిరీ రైతులకిచ్చే బోనస్‌లో లీటర్‌కు అర్ధ రూపాయి కమీషన్ కావాలని స్పీకర్ కోడెల కుమారుడు డిమాండ్ చేయటంతో రెండు నెలలుగా ఆ సంస్థ బోనస్ చెల్లించలేదన్నారు. దీనిపై రైతులు తన దృష్టికి తీసుకురావడంతో డెయిరీ మేనేజర్‌ను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడైందన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న వీరి చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌మాబు, సత్తెనపల్లి మార్కెటింగ్‌యార్డు మాజీ ఛైర్మన్ కట్టా సాంబయ్య, రాజుపాలెం మాజీ ఎంపీపీ బాసు లింగారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement