రీయింబర్స్‌మెంట్ కాక విద్యార్థుల సతమతం
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లోని విద్యార్థుల ఫీజుల కష్టాలకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు ‘ప్రత్యేక’ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు సీమాంధ్ర జిల్లాల్లో, సీమాంధ్ర విద్యార్థులు హైదరాబాద్‌తో సహా వివిధ తెలంగాణ జిల్లాల్లో చదువు సాగించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రస్తుత ఫీజులతో సహా, బకాయిలనూ విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ 58, తెలంగాణ 42 శాతం చెల్లించేలా రెండు ప్రభుత్వాలు సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే ఫీజు చెల్లింపుపై ఏ విధానం అనుసరించాలనే దానిపై ఇరు ప్రభుత్వాలు ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోకపోవడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. అదీ గాక గత ఏడేళ్లలో నాలుగేళ్లపాటు స్థానికత సర్టిఫికెట్లను పొందుపరిస్తేనేస్థానిక నిబంధన కింద రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఏపీలో చదువుకున్న తెలంగాణ విద్యార్థులకూ సమస్య తలెత్తింది. దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తామని ఉన్నతాధికారులు రెండు, మూడు నెలలుగా చెబుతున్నా కార్యరూపం దాల్చలేదు.
ఇబ్బందులు పడుతున్నాం
నాది కృష్ణా జిల్లా. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీటెక్ ట్రిపుల్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. రాష్ట్రం విడిపోకముందే ఈ కోర్సులో చేరాను. ఇప్పుడు నాకు ఫీజు ఇవ్వనంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కాకపోతే మేమే ఫీజు కట్టేలా కాలేజీలు అఫిడవిట్‌లు తీసుకుంటున్నాయి. దీనిపై రెండు ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. - కాళేశ్వరరావు, విద్యార్థి
‘ప్రత్యేక’ ఫీజుకు ఫుల్‌స్టాప్ పడేనా?
Published Thu, Oct 8 2015 12:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement