పోస్టుమెట్రిక్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతన పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పథకం కింద ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయడంలో సర్కా రు తాత్సారం చేస్తోంది. విద్యా సంవత్సరం ముగిసినా పంపిణీ ప్రక్రియ ఎక్కడికక్కడే పెండింగ్‌లో ఉండిపోతోంది. దీంతో ప్రభుత్వమిచ్చే ఉపకార వేతనాలతో పుస్తకాలు, స్టడీ మెటీరి యల్‌కు వినియోగించుకోవచ్చని భావించిన విద్యార్థులకు ఈ జాప్యం సంకటంగా మారుతోంది. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.291.41 కోట్ల ఉపకార బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
– సాక్షి, హైదరాబాద్
కోర్సు ముగిసినా పెండింగ్‌లోనే..
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తుంది. కోర్సు మధ్యలో ఈ నిధులను విడుదల చేస్తే ఆయా విద్యార్థులకు ఉపయోగపడతాయి. కానీ గత కొన్నేళ్లుగా నిధుల విడుదల గాడితప్పుతోంది. కోర్సు ముగిసినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల ప్రణాళిక గాడి తప్పుతోంది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఆర్జన వైపు అడుగులు వేస్తున్నారు. చిన్నాచితకా ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నారు.
మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద వచ్చే మొత్తంతోపాటు ఉపకార వేతనాన్ని సైతం ట్యూషన్ ఫీజు కింద ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు అడ్మిషన్ సమయంలోనే ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇంటర్ స్థాయిలో ఒక్కో విద్యార్థికి రూ.5 వేల ఉపకార వేతనం, రూ.1,900 ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మొత్తం రూ.6,900 వస్తోంది. అలాగే డిగ్రీ విద్యార్థులకు రూ.5 వేల ఉపకార వేతనం, రూ.10 వేల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తోంది. ఈ రెండింటినీ కలిపి ట్యూషన్ ఫీజు కింద కాలేజీ యాజ మాన్యాలకు చెల్లిస్తున్నారు. 2016–17 విద్యా సంవత్సరం తర్వాత విద్యార్థులు టీసీ, మెమోలు పొందాల్సి ఉండగా.. కాలేజీ యాజమాన్యాలు అందుకు నిరాకరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అయితే ఉపకార వేతనం కింద వచ్చే మొత్తాన్ని చెల్లించాలని, లేకుంటే ఏటీఎం కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేçస్తున్నాయి. ఈ క్రమంలో కార్డులిచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇస్తుండగా.. మిగతావారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు బకాయిలు చెల్లిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు సర్టిఫికెట్లను కాలేజీల్లోనే ఉంచాల్సిన పరిస్థితి.
పుస్తకాలకు డబ్బుల్లేవ్...
నవాబ్‌పేటలోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అమ్మనాన్నలు వ్యవసాయ కూలీలే. ఫస్టియర్‌లో వచ్చిన స్కాలర్‌షిప్‌తో సెకండియర్ పుస్తకాలు, టెస్ట్ పేపర్లు కొనుగోలు చేశా. ఈసారీ అలాగే చేయాలనుకున్నా. కానీ సెకండియర్‌కు సంబంధించి ఉపకార వేతన నిధులు ఇప్పటికీ రాలేదు. మరోవైపు ఇప్పటికే అడ్మిషన్ ఫీజు కింద రూ.2 వేలు చెల్లించా. ఫైనల్ ఇయర్‌లో అటు ప్రాక్టికల్స్, ఇటు థియరీకి సంబంధించిన పుస్తకాల కొనుగోలుకు డబ్బుల్లేవు. చేతి ఖర్చుల కోసమైనా ఏదైనా పని చేయాలనుకుంటున్నా.
– సందీప్ కుమార్, నవాబ్‌పేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
వలంటీర్‌గా పని చేస్తున్నా
సామాజిక సేవా విభాగంలో అవకాశాలు బాగుండటంతో పీజీలో ఎమ్‌ఎస్‌డబ్ల్యూ కోర్సులో చేరా. ప్రభుత్వమిచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు రూ.5 వేల ఉపకార వేతనం వస్తుంది. ట్యూషన్ ఫీజును రీయింబర్స్‌మెంట్ ద్వారా చెల్లించొచ్చని, ఇక పుస్తకాలు, మెటీరియల్‌కు ఉపకార వేతనాన్ని వినియోగించుకోవాలని అనుకన్నా. కానీ ఉపకార నిధులు రాలేదు. మరోవైపు కాలేజీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఫీజు డబ్బులు చెల్లించే స్తోమత లేదు. ఖర్చుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పని చేస్తున్నా.
– రాజు నాయక్, షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా