ఆ జోన్‌పై నేరగాళ్లు గురి పెట్టారా? | are criminals target north Zone ? | Sakshi
Sakshi News home page

ఆ జోన్‌పై నేరగాళ్లు గురి పెట్టారా?

Published Sat, Aug 13 2016 10:41 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

are criminals target north Zone ?

సాక్షి, సిటీబ్యూరో:  రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్క నయీం ముఠా (ఎన్‌–గ్యాంగ్‌) ప్రంకపనలు కొనసాగుతుండగా.. మరోపక్క నగరంలోని నార్త్‌జోన్‌లో (ఎన్‌–జోన్‌) శనివారం చోటు చేసుకున్న కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి.  రియల్‌ ఎస్టేట్‌ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత దండు యాదగిరిపై కొందరు హత్యాయత్నం చేశారు. గడిచిన 25 రోజులుగా ఉత్తర మండలాన్ని నేరగాళ్లు తమ టార్గెట్‌గా చేసుకున్నారు. స్నాచింగ్, సూడో పోలీసు అటెన్షన్‌ డైవర్షన్‌... తుపాకులతో బెదిరించి దోపిడీలు, కాల్పులు జరిపి హత్యాయత్నం చేయడం వరకు జరిగాయి.

వేళాపాళా లేకుండా వరుసపెట్టి...
నార్త్‌జోన్‌ పరిధిలో జరిగిన వరుస సంచలనాత్మక నేరాలన్నీ కేవలం రాత్రి వేళల్లో జరిగినవి కాదు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య జరిగాయి. దీన్ని బట్టి నేరగాళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది. నార్త్‌జోన్‌ మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఉండటం, పారిపోవడానికి అనువైన ప్రాంతాలు/మార్గాలు సైతం ఎక్కువ కావడం దుండగులకు అనుకూలంగా మారుతోంది. దీన్ని ‘సద్వినియోగం’ చేసుకుంటున్న నేరగాళ్లు పోలీసు నిఘాను అపహాస్యం చేస్తూ వరుసపెట్టి పంజా విసరుతున్నారు. నార్త్‌జోన్‌లో గడిచిన 25 రోజుల్లో జరిగిన నేరాల్లో ఏ ఒక్క కేసూ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఉత్తర మండలంలో మొత్తం ఎనిమిది పోలీసుస్టేషన్లు ఉండగా... ఈ నేరాలన్నీ బోయినపల్లి, మహంకాళి, కార్ఖానా ఠాణాల పరిధుల్లోనే జరగడం గమనార్హం.

వరుసగా రెండు రోజులూ...
హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఉత్తర మండలం, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌ అనుకొని ఉంటాయి. అల్వాల్, బోయిన్‌పల్లి ఠాణాలు సైతం సరిహద్దుల్లోనివే. ఈ రెండింటి పరిధిలో శుక్ర, శనివారాల్లో వరుసగా కాల్పుల కలకలం రేపాయి. అల్వాల్‌ ఠాణా పరిధిలోని మచ్చబొల్లారంలోని రెడ్డి వైన్స్‌ ఎదురుగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఘటన జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖాళీ తూటా స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం బోయిన్‌పల్లి ఠాణా పరిధిలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లి మల్లికార్జునకాలనీలో కాంగ్రెస్‌ నేత యాదరిగిపై కాల్పులు జరిగాయి. ఈ రెండు ఘటనల మధ్యా ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement