
వడ్డీల మోహన్‌రెడ్డికి ఏసీబీ ఉచ్చు
ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సైతం రంగంలోకి దిగారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉండటం, ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉండటంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆయన అక్రమాస్తులు తేల్చుతున్నారు. దీంపాటు ఈ దందాకు సహకరించిన ఉద్యోగుల పాత్రను కూడా తేల్చే పనిలో పడ్డారు. అందులో భాగంగా శుక్రవారం మోహన్‌రెడ్డి చేతిలో మోసపోయి ఆస్తులు పోగొట్టుకున్న 20మంది బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. వారికి సంబంధించి 58 డాక్యుమెంట్లను సేకరించారు. దీంతోపాటు మోహన్‌రెడ్డి, ఆయన బినామీలకు సంబంధించిన 550 డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు సేకరించారు. వీటి వాస్తవ విలువను అంచనా వేసే పనిలో పడ్డారు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాక కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మోహన్‌రెడ్డిని విచారించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది.
పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై సీరియస్
ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా ఏసీబీ అధికారులకు ఆదేశాలిచ్చారు. అదే సమయంలో మోహన్‌రెడ్డిపై పెండింగ్‌లో ఉన్న ఏసీబీ కేసును తిరగదోడుతున్నారు. 2006లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ మోహన్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. మరోవైపు మోహన్‌రెడ్డి కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే మోహన్‌రెడ్డితోపాటు ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపిన అధికారులు.. తాజాగా శుక్రవారం మరో ఆరుగురిని న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసులో మోహన్‌రెడ్డితోపాటు నిందితులైన సింగిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సింగిరెడ్డి జితేందర్‌రెడ్డి, కెక్కర్ల పరశురాములు(సీఐడీ కానిస్టేబుల్) సర్దార్ పర్మిందర్‌సింగ్ అలియాస్ పంకజ్‌లను, అలాగే, దోనపాటి వెంకటరమణారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో నిందితులైన ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, కత్తి రమేశ్‌లను సీఐడీ అధికారులు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఆదేశాలతో 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు.