హత్యాయత్నం దుర్మార్గం
నైతిక బాధ్యత అధికార యంత్రాంగానిదే: ఎమ్మెల్యే కిలివేటి
నాయుడుపేట టౌన్ : అధికార పార్టీ నాయకుల అక్రమాలను అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరం మధుసూదననాయుడు, భైనా చంద్రశేఖర్‌రెడ్డిలను హత్యచేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా ఖండించారు. నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో బాధితులకు ప్రథమ చికిత్స నిర్వహిస్తుండగా ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ రఫీలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాయకులు ఇద్దరికీ ప్రథమ చికిత్సలు నిర్వహించి వెంటనే మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించేలా సత్వర చర్యలు చేపట్టారు.
అనంతరం ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హత్యాయత్న ప్రయత్నంపై తీవ్రంగా ఖండిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్వాకం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే స్వర్ణముఖి నది నుంచి భారీగా ఇసుక డంపింగ్‌లు చేసి వందల సంఖ్యలో లారీల్లో అక్రమంగా తరలించుకుపోతున్నారని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారన్న కారణంతో తమ పార్టీకి చెందిన నేతలపై దాడి చేసి హత్యారాజకీయాలకు తెరలేపుతున్నారని వారు దుయ్యబట్టారు. జిల్లా అధికార యంత్రాగమే ఇందుకు నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, అధికారపార్టీ అండదండలతో వీరు చేస్తున్న దురాగతాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉద్రిక్తత
వైసీపీ నేతలు పేరం మధుసూదననాయుడు, భైనా చంద్రశేఖర్‌రెడ్డిలపై హత్యాయత్నం జరిగినట్లు తెలుసుకుని పెళ్లకూరు మం డలం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అనేకమంది ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేతల కుటుంబ సభ్యు లు, బంధువులు, పార్టీ నాయకులు పలువురు చేరుకుని అధికార పార్టీ వైఖరిపై తీవ్రంగా విమర్శించారు. వైద్యశాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పెళ్లకూరు ఎస్సై రవినాయక్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులు సైతం ఆగ్రహంతో ఉన్నారని,ఏదైనా ఉద్రిక్తత నెలకొంటే మీరే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని హెచ్చరించారు.