అసెంబ్లీ మీడియా పాయింట్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
సాక్షి, హైదరాబాద్: విపక్ష సభ్యులను సభ నుంచి ఏకపక్షంగా సస్పెండ్‌చేసి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. చర్చకు పట్టుబడితే మార్షల్స్‌తో బలవంతంగా సభ నుంచి గెంటివేశారు. రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు మేము పలు నిర్మాణాత్మక సలహాలిచ్చినా ప్రభుత్వం లక్ష్య పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సర్కారు రైతు వ్యతిరేక విధానాలపై, సిద్ధాంతాలు వేరైనా విపక్షాలన్నింటితో కలసి పోరాడతాం. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలి.
- జానారెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత
25 శాతమే రుణమాఫీ జరిగింది
చిన్న, సన్నకారు రైతులకు 25 శాతమే రుణమాఫీ జరిగింది. రుణాలు చెల్లించలేక రైతులు, కళాశాలల ఫీజులు చెల్లించలేక రైతుల పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతాంగానికి ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలి.
- జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
రుణమాఫీ వడ్డీకే సరిపోయింది
ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయింది. రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న సర్కారు వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇది చీకటి రోజు
విపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడం రైతులను అవమాన పరిచినట్టే. ఏకమొత్తంలో రుణమాఫీ అమలు చేయాలి. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు కూడా నష్టపరిహారం అందజేయాలి.
- డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నేత
ఆత్మహత్యలు ఆగేవరకు పోరాడతాం
రైతుల ఆత్మహత్యలు ఆగేవరకు వారి పక్షాన పోరాటం చేస్తాం. విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేసి కొత్త రుణాలిప్పించాలి. ఈ విషయంలో వాయిదా తీర్మానం ఇచ్చినా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
- పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ పక్ష నేత
మామా అల్లుళ్లకు ఆటవిడుపుగా అసెంబ్లీ
శాసనసభ సమావేశాలు ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావులకు(మామా అల్లుళ్లకు) ఆటవిడుపుగా మారాయి. విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణం. వాటర్‌గ్రిడ్ కోసం కేటాయించిన రూ.42 వేల కోట్లలో కొంత రైతు రుణమాఫీకి మళ్లించాలి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ త్వరలో రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం.
- రేవంత్‌రెడ్డి, టీడీపీ
సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
సభ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ తొలగించాలి. రైతుల ఆత్మహత్యల నివారణపై నిర్మాణాత్మక చర్చ జరగాలంటే విపక్ష సభ్యులు సభలో ఉండాలి. మందబలం ఉందని విర్రవీగితే హర్యానాలో బన్సీలాల్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. వాటర్‌గ్రిడ్‌కు కేటాయించిన నిధులను రైతు రుణమాఫీకి మళ్లించాలి.
- ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే
నిజనిర్ధారణ కమిటీ వేయాలి
రాష్ట్రంలో సుమారు 1,400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను గ్రామ సభల ద్వారా గుర్తించాలి.
- సున్నం రాజయ్య, సీపీఎం పక్ష నేత
సర్కారువి నియంతృత్వ పోకడలు
రైతుల ఆత్మహత్యల విషయంలో దేశంలో మహారాష్ట్ర తరువాత తెలంగాణది రెండవ స్థానం. ఆత్మహత్యలు నిలుపుదల చేసేందుకు సలహాలు ఇస్తామంటే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనం. రుణమాఫీ చేసేందుకు మా వద్ద బ్లాక్ మనీ లేదంటున్న సీఎం..ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
- రవీంద్రకుమార్, సీపీఐ పక్ష నేత