ఏటీఎంలకూ సెలవే
ఏటీఎంలకూ సెలవే
Published Sat, Dec 10 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
బ్యాంకులకు వరుస సెలవులు
ఏటీఎంల ఎదుట కష్టాల నెలవు
ఎక్కడా నోట్లు లేవు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో మూతపడ్డాయి. ఏటీఎంలు సైతం ఇదే బాటపట్టాయి. రెండో శనివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోలేదు. ఇదే సందర్భంలో జిల్లాలో అత్యధిక శాతం ఏటీఎంలు పనిచేయలేదు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకుల ఏటీఎంలలో అక్కడక్కడా పూర్తిస్థాయిలో నగదు పెట్టినా.. ఆ మొత్తాలన్నీ కొన్ని గంటల్లోనే అయిపోయాయి. పనిచేసిన కొన్ని ఏటీఎంల వద్ద ఉదయం పూట భారీ క్యూలు కనిపించాయి. మధ్యాహ్నానికి వాటిలో నగదు అయిపోవడంతో ఖాళీ అయ్యాయి. దీంతో ఏటీఎంలను మూసివేశారు. తెరిచిన సమయంలోనూ మెషిన్ల నుంచి రూ.2 వేల నోట్లు మాత్రమే వచ్చాయి. సాయంత్రానికి జిల్లాలోని ఒక్క ఏటీఎంలోనూ డబ్బులు లేని పరిస్థితి. బ్యాంకులతో పాటు ఏటీఎంలు మూతపడటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ!
మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు అనే విషయం ముందుగానే తెలిసినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో డబ్బులు ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఎలా గడపాలిరా దేవుడా అంటూ ప్రజలు వాపోతున్నారు. ఆదివారం, సోమవారం కూడా బ్యాంకులకు సెలవులు కావడంతో ఈ రెండు రోజులు ఎలా గడుస్తాయా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తం అవుతోంది. మరోవైపు జనం దగ్దర డబ్బులు లేకపోవడంతో వ్యాపారాలు తగ్గిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ అయినా అమ్మకాలు, కొనుగోళ్లు లేక కిరాణా, బట్టల దుకాణాలు వెలవెలబోతున్నాయి. క్రిస్‌మస్ సమీపిస్తున్నా ఇప్పటివరకూ వ్యాపారాలపై ఆ ప్రభావం కనపడలేదు. సెలవులు రానుండడంతో ముందుగా శుక్రవారమే బ్యాంకుల నుంచి సొమ్ము తెచ్చుకోవడానికి ప్రయత్నించినా నగదు లేదని ఉద్యోగులు చేతులెత్తేవారు. దీంతో జనమంతా ఏటీఎంలపైన ఆశలు పెట్టుకున్నారు. శనివారం ఏ ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో వారి ఆశలు అవిరి అయ్యాయి.
తెరుచుకోని ప్రత్యేక కౌంటర్లు
మూడు రోజులపాటు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నగదు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించినా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంలు తెరుచుకోలేదు. కిరాయిలు లేక మినీ వాహనాలు, ట్రక్కు ఆటోలు నెల రోజులుగా స్టాండుల్లోనే కాలం గడుపుతున్నాయి. భీమవరం పట్టణంలో ఏటీఎంలలో నగదు లేక జనం నిరాశతో వెనుదిరగడం కనిపించింది. కొన్ని ఏటీఎంల షట్టర్లు పూర్తిగా మూతపడగా.. మిగతాచోట్ల షట్టర్లను సగం వరకు దించేశారు. కొన్ని చోట్ల ఏటీఎంలు తెరిచి ఉన్నా బ్యాలెన్స్ చూసుకోవడం వరకే పనిచేశాయి. నరసాపురంలో ఒక్క ఏటీఎం కూడా పని చేయలేదు. పట్టణంలో 12, నరసాపురం మండలంలో 4, మొగల్తూరు మండలంలో 3 ఏటీఎంలున్నాయి. వాటినుంచి నగదు లభించలేదు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 29 ఏటీఎంలు ఉండగా శనివారం కేవలం రెండు మాత్రమే పనిచేశాయి. అవికూడా మధ్యాహ్నం వరకు పనిచేశాయి. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలతోపాటు పట్టణ పరిధిలో 50 ఏటీఎంలు ఉండగా, ఒక్క ఏటీఎం మాత్రమే పని చేస్తోంది. ఇందులోనూ రూ.2 వేల నోట్లు మాత్రమే వస్తుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తణుకు సజ్జాపురం ఎస్‌బీఐ మాత్రమే తెరిచారు. అత్తిలి మండలంలో 11 బ్యాంకులు, 13 ఏటీఎంలు మూతపడగా ఇరగవరం మండలంలో 3 బ్యాంకులు 3 ఏటీఎంలు మూతబడ్డాయి. ఒక్క ఏటీఎం కూడా పనిచేయటం లేదు. పాలకొల్లు పట్టణం, పాలకొల్లు మండలం, యలమంచిలి, పోడూరు మండలాల్లో ఉండగా 32 ఏటీఎంలు ఉండగా, ఏ ఏటీఎం నుంచి కూడా ఒక్క రూపాయి రాలేదు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో 20 ఏటీఎంలు ఉండగా ఒక్కచోటా నగదు లేదు.
Advertisement
Advertisement