ఉరేసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
-
భార్య కోపగించుకుందని...
నెల్లూరు(క్రైమ్) : భార్య కోపగించుకుందని మనస్థాపంతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...కిసాన్‌నగర్ అరవిందానగర్‌కు చెందిన పి. దుర్గాప్రసాద్ (29)కు తొమ్మిది నెలలు కిందట ఉదయగిరికి చెందిన శారద అలియాస్ చరితతో వివాహమైంది. వివాహానంతరం దుర్గాప్రసాద్ జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో కాపురం పెట్టారు. ఆటో నడపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి దుర్గాప్రసాద్ తీవ్ర ఉద్వేగానికి లోనైయ్యేవాడు. ఈ విషయమై పలుమార్లు దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గొడవ పడిన కొద్దిసేపటికి ఇద్దరూ మళ్లీ కలిసి పోయేవారు. రోజు అత్త, మామలతో గంటపాటు సరదాగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవాడు. దీపావళి పండగకు భార్యతో కలిసి దుర్గాప్రసాద్ ఉదయగిరిలోని అత్తవారింటికి వెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో శారదను తమాషాగా గిచ్చడంతో ఆమె కోపడింది. తినే అన్నం ప్లేటును విసిరికొట్టింది. దీంతో మనస్థాపానికి గురైన దుర్గాప్రసాద్ ఎవరికి చెప్పా పెట్టకుండా ఈ నెల 1వ తేదీ నెల్లూరుకు వచ్చేశాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. 2వ తేదీ మైపాడుగేటు సమీపంలోని ఆటోస్టాండ్ వద్ద సహచర ఆటోడ్రైవర్లతో బాగా పొద్దుపోయే వరకు గడిపాడు. తన స్నేహితుడైన అరుణ్‌కుమార్‌కు గురువారం బాడుగ ఉందని ఉదయం 7 గంటలకు వస్తానని చెప్పి వెళ్లాడు. రాత్రి భార్యతో చాలాసేపు ఫోనులో మాట్లాడారు. అనంతరం ఇంట్లోని శ్లాబుకు ఉన్న కొక్కీకి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం దుర్గాప్రసాద్ ఎంతకి రాకపోవడంతో అరుణ్‌కుమార్ అతని ఇంటి వద్దకు వెళ్లాడు. తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపల నుంచి గడియపెట్టి ఉంది. దుర్గాప్రసాద్‌ను పిలిచినా లోపలి నుంచి ఎలాంటి శబ్ధం లేకపోవడంతో కిటికీలోనుంచి చూడగా కొక్కీకి దుర్గాప్రసాద్ వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు, రెండో నగర పోలీసులకు సమాచారం అందించారు. రెండో నగర ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించారు. దుర్గాప్రసాద్ మృతి విషయం తెలుసుకున్న భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు చేరుకుంది. భర్త మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బా«ధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండో నగర ఎస్‌ఐ తిరుపతయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.