ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు అటానమస్‌ | Autonomous to Arts & Science College | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు అటానమస్‌

Published Sat, Aug 13 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు అటానమస్‌

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు అటానమస్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌
  • అమలుకు త్వరలోనే 20 కమిటీల ఏర్పాటు
  • కేయూ క్యాంపస్‌ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి ఆరేళ్ల పాటు స్వయం ప్రతిపత్తి(అటానమస్‌ స్టేటస్‌) హోదా కల్పిస్తూ కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.బెనర్జీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితమే ఆర్ట్స్‌ కళాశాలకు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి లభించగా కేయూ స్టాండింగ్‌ కమిటీ, సెనేట్‌ కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఈ విద్యాసంవత్సరం(2016) నుంచి 2022వ సంవత్సరం వరకు అటానమస్‌ కాలేజీ కొనసాగేలా కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ ఎప్పుడో పూర్తికావాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది. కాగా, అటానమస్‌ అమలు కోసం కళాశాలకు గవర్నింగ్‌ బాడీ, అకడమిక్‌ కమిటీ, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ కమిటీ, ఫైనాన్సియల్‌ కమిటీలు నియమించాల్సి ఉంటుంది. అలాగే, ప్రతీ విభాగానికి విభాగాధిపతులు, బోర్డు స్టడీస్‌ చైర్మన్లనే కాకుండా స్టూడెంట్‌ వెల్ఫేర్‌ కమిటీలు తదితర ఇరవై కమిటీలను ఏర్పాటుచేయాలి. ఈ ప్రక్రియను 16వ తేదీ నుంచి చేపట్టనున్నారు.
     
    89 వసంతాలు పూర్తి
    ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ హన్మకొండ సుబేదారిలో 1927 జూన్‌లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ కళాశాల ఏర్పడి 89 వసంతాలు పూర్తికాగా, వచ్చే ఏడాది జూన్‌తో 90వ సంవత్సరంలోకి అడుగిడనుంది. ఇప్పటికే న్యాక్‌ Sఏ గ్రేడ్‌ కలిగి ఉన్న ఈ కళాశాలలో బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీతో పాటు వివిధ పీజీ కోర్సులు కలిపి 24 కోర్సులు కొనసాగుతున్నాయి. అన్ని కోర్సుల్లోనూ అడ్మిషన్లు మెరుగుగానే ఉండగా 4,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. 23 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, 52మంది కాంట్రాక్చువల్‌ లెక్చరర్లు, 65మంది పార్ట్‌టైం అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తుండగా 40మంది నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. అయితే, సరిపడా రెగ్యులర్‌ అధ్యాపకులు లేకపోవడంతో సమస్యగా మారింది. అయితే, కాంట్రాక్చువల్, పార్ట్‌టైం అధ్యాపకుల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ కలిగిన వారు ఉండడంతో అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే ఆర్ట్స్‌ కలాశాలకు అటానమస్‌ హోదా దక్కినందుకు ఫలితం ఉంటుంది.
     
    స్వయం ప్రతిపత్తితో ప్రయోజనాలివీ..
    యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి స్వయం ప్రతిపత్తి దక్కిన నేపథ్యంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కోర్సులతో పాటు ఇంకా పలు ఉపాధి, తదితర కోర్సులు ఏర్పాటుచేసుకోవడమే కాకుండా సిలబస్‌ రూపొందించుకోవచ్చు. ఏటా యూజీసీ నుంచి రూ.22లక్షల నిధులతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాలకు ప్రత్యేక నిధులు రానున్నాయి. ప్రతీ విభాగంలోని అధ్యాపకులకు రీసెర్చ్‌ ప్రాజెక్టుల కింద నిధులు రానున్నాయి. ప్రశ్నాపత్రాల రూపకల్పన, మూల్యాంకనం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలి. అయితే, మార్కుల మెమోలు కేయూ నుంచి జారీ చేయనుండగా వాటిపై కేయూతో పాటు అటానమస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల అని ముద్రిస్తారు. అటానమస్‌ హోదా దక్కడం వల్ల అకడమిక్‌ పరంగా పూర్తిస్వేచ్ఛ ఉన్నప్పటికీ టీచింగ్, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులకు వేతనాలు యూనివర్సిటీ నుంచే ఇస్తారు. ఆరేళ్ల గడువు పూర్తయ్యాక మళ్లీ రీ అటానమస్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
     
    అమలుకు చర్యలు 
    రామానుజరావు, ప్రిన్సిపాల్‌
    యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి యూనివర్సిటీ నుంచి అటానమస్‌ హోదాకు అనుమతి లభించింది. ఈ మేరకు అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నాం. త్వరలోనే అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటుచేయడంతో పాటు అవసరమైన 20 కమిటీలను నియమించనున్నాం. యూజీసీ, రూసా నుంచి నిధులు రానుండడంతో కళాశాల అభివృద్ధి చెందే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement