
కాపుల పాలిట రూథర్ ఫర్డ్
చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమన కరుణాకర్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: కాపు కులం పట్ల చంద్రబాబు రూథర్‌ఫర్డ్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. మన్యంలో గిరిజనులను బ్రిటిష్ అధికారి రూథర్‌ఫర్డ్ పిట్టలను కాల్చినట్లు కాల్చి ఆ ఉద్యమాన్ని అణచివేసే రీతిలోనే.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా కాపుకులాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో తుని ఘటన కేసులో మంగళవారం విచారణకు హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు తుని ఘటనతో ఏవిధమైన సంబంధం లేని తనను కుట్రపూరితంగా ఇరికించి, వై.ఎస్.జగన్‌ను బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తుని ఘటనకు సంబంధించి నోటీసు ద్వారా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయానికి పిలిపించారు. 6గంటలపాటు విచారణ జరిపారు.