బ్యాంకు మూసివేసిన దృశ్యం
బ్యాంకుల సమ్మె సంపూర్ణం
Published Fri, Jul 29 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
జిల్లావ్యాప్తంగా మూతపడ్డ బ్యాంకులు
– రూ.1500 కోట్ల ఆర్థిక లావాదేవీలకు బ్రేక్
– ఏటీఎంల దగ్గర బారులు తీరిన కస్టమర్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ వంటి చర్యలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె నిర్వహించారు. సుమారు ఐదున్నర వేల మంది పైచిలుకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన 520 శాఖలు మూతపడ్డాయి. బ్యాంకర్ల అంచనా ప్రకారం జిల్లా అంతటా రూ.1500 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి.
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) పిలుపు మేరకు స్పందించిన అన్ని బ్యాంకులూ శుక్రవారం మూతపడ్డాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ,ఎస్ బ్యాంకులు మినహా మిగతా ప్రభుత్వ రంగ, గ్రామీణ, సహకార రంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, మదనపల్లి పట్టణాల్లో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా బ్యాంకింగ్ రంగంలో నిర్హేతుక సంస్కరణలు అమలు చేసేందకుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, వీటిని సంఘటితంగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఎస్‌బీఐలో ఎస్‌బీహెచ్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లను విలీనం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు పేర్కొన్నారు.
ఆర్థిక లావాదేవీలకు బ్రేక్...
బ్యాంకుల సమ్మె కారణంగా జిల్లాలో రూ.1500 కోట్ల ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. విదేశీ మారకద్రవ్యం, జీతభత్యాల చెల్లింపులు, ట్రెజరీ బిల్లులు, ఆదాయపన్నుల చెల్లింపులన్నీ స్తంభించాయి. తిరుపతి, చిత్తూరు, తిరుచానూరు, మదనపల్లి, పలమనేరు పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పలు ఏటీఎంల్లో నగదు నిండుకొంది. విత్‌డ్రాయల్స్ లేక కస్టమర్లు ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరారు.
Advertisement