ట్రిపుల్ ఐటీలో భోజనాల వద్ద విద్యార్థులు
పెట్టింది తినాలి.. మెస్‌లపై పర్యవేక్షణ కరువు
తక్కువ ధర కూరగాయల వైపే మొగ్గు
నూనె, సామగ్రి కల్తీమయం
అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
భైంసా: తెలంగాణలో ఏకైక ట్రిపుల్ ఐటీ ట్రబుల్ ఐటీగా మారింది. ఆహ్లాదకర వాతావరణం రుచి, శుచి ఉన్న భోజనం దొరకక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయాలపై దృష్టి సారించకపోవడంతో మెస్ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఏడు వేల మంది విద్యార్థులుండగా, వారి కోసం మూడు మెస్‌లు ఉన్నాయి. ఒక్కో మెస్‌లో 2 వేల మంది విద్యార్థులు భోజనం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. అ యితే, ఈ మూడు మెస్‌ల్లోనూ నాణ్యమైన భోజనం దొరకడం లేదు. ఈ విషయమై విద్యార్థులు పలుమార్లు ఆందోళనకు దిగినా ఫలితం ఉండడం లేదు. ఆందోళన చేపట్టిన ప్రతిసారి నచ్చజెప్పి పంపిస్తున్నారే తప్ప.. మెస్ నిర్వాహకుల వైఖరి మాత్రం మారడం లేదు. మెస్ ని ర్వాహకుల కనుసన్నల్లోనే అధికారులు వ్యవహరించడమే కారణమని విమర్శలు వస్తున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో రెండోసారి..
బాసర ట్రిపుల్‌ఐటీలో కలుషిత భోజనం చేసి విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలు అనేకం. ఈ విద్యాసంవత్సరంలో ఆగస్టు 16న 150 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, 100మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మెస్‌లో భోజనాలు చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, తలతిప్పడం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. నీరు దుర్వాసన వస్తున్నా.. మెస్‌లో కంపుకొట్టినా విద్యార్థులు భరించాలే తప్ప సరిచేసే అవకాశమే లేకుండాపోయింది.
తక్కువ ధరవైపే మొగ్గు...
ట్రిపుల్ ఐటీ మెస్ నిర్వాహకులు సరుకుల కోసం దగ్గరగా ఉన్న సంతలను ఎంచుకుంటున్నారు. మెనూతో సంబంధం లేకుండా తక్కువ ధరకు దొరికే కూరగాయలను కొనుగోలు చేసి నిల్వ చేసి ఉంచుతున్నారు. వాటినే వండి వార్చుతున్నారు. మాంసాహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడంలేదు. తక్కువ ధరకు లభించే చికెన్, కోడిగుడ్లను తీసుకొస్తున్నారు. మెస్‌లపై పర్యవేక్షణ కరువు కావడంతో నిర్వాహకులు తమకు నచ్చిన.. తక్కువ ధరకు దొరికే నాసి రకం సరుకులతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఏడు వేల మంది విద్యార్థుల కోసం మాంసాహారం తీసుకొస్తుండగా, ఒక్కసారి కూడా పశువైద్యాధికారులు ఇప్పటి వరకు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. రోగాల బారిన పడ్డ కోళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వండుతున్నారని విద్యార్థులే బాహాటంగా ఆరోపిస్తున్నారు.
చదువుపై ప్రభావం...
ట్రిపుల్‌ఐటీ మెస్‌లలో ప్రతిరోజూ ఒకరిద్దరు విద్యార్థులు అస్వస్థతకు లోనవుతూనే ఉంటా రు. చాలా మంది విద్యార్థులు భోజనాలు చే సేందుకు భయపడుతుంటారు. కొంత మంది భోజనాలు చేశాక నేరుగా ఆసుపత్రికి వెళ్లి మా త్రలను వాడుతుంటారు. మెస్‌లలో సరైన భో జనం లేక అస్వస్థతకు గురైన విద్యార్థులు ప్రతి సారీ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పూర్తిగా కోలుకున్నాకే తల్లిదండ్రులు ట్రిపుల్‌ఐటీ కళాశాలకు పంపిస్తున్నారు. పది, పదిహేను రోజుల పాటు ఇంటి వద్ద ఉండి వచ్చేసరికి విద్యార్థులు తరగతులను కోల్పోతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు విద్యాపరంగానూ నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. అధికారులు స్పందించి విద్యార్థుల వెతలు తీర్చాల్సిన అవసరం ఉంది.