-
బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప
-
పర్యాటకులకు కనువిందు చేసిన స్టాల్స్
-
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
-
తీరంలో నాలుగు రోజులు కొనసాగనున్న సందడి
ఉవ్వెత్తున ఎగసే జలధి తరంగాలు మనసులో వెల్లువెత్తే ఉత్సాహానికి ఉపమానాలు. ఆ అలల సాక్షిగా.. కాకినాడ కడలి తీర సందర్శకుల మదిలో అటువంటి ఉత్సాహమే ఉరకలెత్తింది. గురువారం ప్రారంభమైన సాగర సంబరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో, వివిధ రకాల పశు ప్రదర్శనలు, స్టాల్స్.. ఇటు విజ్ఞానాన్ని, అటు ఆనందాన్ని పంచాయి. సంక్రాంతి సందడి ఈ సంబరాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నిశి ముసిరిన వేళ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను అలరించాయి.
కాకినాడ బీచ్‌లో గురువారం సాగర సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ«ధ్యాత్మికత విలసిల్లే ఆలయ నమూనాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే థింసా.. కొమ్ము నృత్యాలు, చేనేతల అందాలు, రంగురంగుల పూల సోయగాలు, నోరూరించే వంటకాలు, కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టే శిల్పాలు, చిత్రాలు, జాతీయ సమైక్యతను చాటి చెప్పే సాంస్కృతిక ప్రదర్శనలు సాగరతీరంలో కొలువుదీరి పర్యాటకులకు కనువిందు చేశాయి. బెంగళూరు ఫ్లవర్ షో, వ్యవసాయశాఖ, పురావస్తుశాఖ, ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్, ఏపీ టూరిజం, ఉద్యానవనం, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మత్య్సశాఖ ఆధ్వర్యంలో రొయ్యల పుట్టుక, పెరిగే విధానం, వాటిని ఎగుమతి చేసే పద్ధతులు వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్‌లో వివిధ రకాల మత్స్యసంపదను ప్రదర్శించారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే విధానాలు, నేత, దారాలకు రంగులు అద్దె తీరు, వస్రా్తలు తయారు చేసే పద్ధతిని వివరించే విధంగా స్టాల్స్ పెట్టారు. పశుసంవర్ధక శాఖకు చెందిన స్టాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో డాగ్ షోను, పుంగనూరు ఆవు, దూడ, ఒంగోలు ఆవు, ముర్రాగేదె, గిరి ఆవులను ప్రదర్శనలో ఉంచారు.
– కాకినాడ రూరల్
నోరూరించిన వంటకాలు
గోదావరి వంటకాలు, పెరుమాళ్లపురం బెల్లంగారెలు, మారేడుమిల్లికి చెందిన బ్యాంబూ చికెన్, గోదావరి మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన 36 రకాల సముద్ర ఉత్పత్తుల వంటకాలు, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామం జీడిపప్పు, పచ్చళ్ల వ్యాపారం, ఆత్రేయపురం నేతి పూతరేకులు, మాడుగుల అల్వా, రాయలసీమ బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి, పెద్దాపురం పాలకోవా ఇలా 100కి పైగా వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్‌తో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన తినుబండారాలు నోరూరించాయి. ఇలా సాగరతీరంలో 400 రకాల స్టాల్స్ పర్యాటకులకు కనువిందు చేశాయి.
అలరించిన శిల్పాలు, చిత్రాలు
ఒడిశాకు చెందిన కళాకారులు బీచ్‌లో వేసిన నగదు రహిత విధానాన్ని తెలిపేలా, జిల్లా నమూనాలో ఉన్న సముద్ర ఉత్పత్తులు, వివిధ పంట ఉత్పత్తులతోను, మత్స్యకన్య, బుద్ధుడు, తిరుమల, తిరుపతి దేవస్థానం, శ్రీకృష్ణుడు వంటి సైకత శిల్పాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. దీన్ని ప్రకాశంజిల్లా అద్దంకికి చెందిన కళాకారులు ఏర్పాటు చేశారు.
విరుల విందు
బెంగళూరు, చెన్నైలతో పాటు జిల్లాలోని కడియం, కడియపులంక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 350 వరకు వివిధ జాతుల పూల మొక్కలు, బోన్సాయ్, వివిధ రకాల కొటా¯Œ్స మొక్కలు, వివిధ పండ్లతో తయారు చేసిన దేవుళ్ల ఆకారాలను ప్రదర్శించారు.
నమూనా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి నమూనా దేవస్థానాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా సముద్రతీరంలో తాటాకులతో ప్రత్యేక ఇళ్లను జిల్లా విద్యాశాఖ నిర్మించింది. సంక్రాంతి పండగ గ్రామాల్లో ఏ విధంగా ఉండేదో వివరిస్తూ గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గంగిరెద్దులు, హరిదాసు, గరగల నృత్యం, కోలాటం, కాళికానృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే «థింసా, కొమ్ము నృత్యం పర్యాటకులను ఆకట్టుకున్నాయి.
జిల్లా సంస్కృతి చాటేలా బీచ్‌ఫెస్టివల్
కాకినాడ రూరల్ : జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నాలుగురోజులపాటు ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం రాత్రి కాకినాడ సాగరతీరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. తూర్పుగోదావరి ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతీసంప్రదాయాలకు పర్యాటక పరమైన ప్రాచుర్యం కల్పించేందుకు ఏటా క్రమం తప్పకుండా కాకినాడ బీచ్ ఫెస్టివల్, కోనసీమ, మన్యం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ నుంచి అంతర్వేది, రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, మారేడుమిల్లి సర్క్యూట్‌లను రూ.350 కోట్లతో అభివృద్ధి చేసి జిల్లాను టూరిజం హబ్‌గా రూపుదిద్దుతున్నట్టు చినరాజప్ప వివరించారు. వచ్చే ఏడాది బీచ్ ఫెస్టివల్‌ను జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.23 కోట్లతో మొదట దశ పనులు పూర్తి చేశామన్నారు. బీచ్ ఫెస్టివల్ తరహాలో ఫిబ్రవరిలో కోనసీమ ఉత్సవాలు, మార్చిలో మన్యం ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రూ.100 కోట్లు బీచ్ అభివృద్ధికి కేటాయించారన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యులు కాకరపల్లి సత్యవతి, ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణమూర్తి, స్థానిక సర్పంచ్ యజ్జల బాబ్జీ తదితరులు ఈ సాగర సంబరాలను పర్యవేక్షించారు.