సుందరతీరం.. ఇలా వికారం.. | beach very varest | Sakshi
Sakshi News home page

సుందరతీరం.. ఇలా వికారం..

Published Mon, Oct 17 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

సుందరతీరం.. ఇలా వికారం..

సుందరతీరం.. ఇలా వికారం..

ఘన విజయం సాధించిన బాపు, రమణల ‘ముత్యాలముగ్గు’ సినిమా గురించి యువతరానికి తెలియకపోవచ్చు గానీ.. పెద్దల్లో చాలామందికి అందులోని కాంట్రాక్టర్‌ పాత్రలో ప్రముఖనటుడు రావు గోపాలరావు పలికిన డైలాగులు గుర్తుండే ఉంటాయి. ‘తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏముంటది? మడిసన్నాక కుసింత కలాపోసన (కళాపోషణ) ఉండాలి’ అన్న మాట ఆ సినిమాలోని హిట్‌ డైలాగుల్లో ఒకటి. నేరాలే వృత్తివ్యాపకంగా కలిగిన ఆ పాత్ర అంతటితో ఆగక అస్తమించే సూర్యుడిని వర్ణిస్తుంది కూడా! ఆ కాంటాక్టర్‌ పాత్ర చెప్పిందని కాదు గానీ.. చాలామంది సాయంకాలాలు ఒకింత కళాత్మకంగా, ప్రకృతి ఒడిలోనే గడపాలనిపిస్తుంది. ఆ క్రమంలోనే సాయంత్రాలు బీచ్‌లు పర్యాటకులతో సందడిగా కనిపిస్తాయి. తన చెంతకు వచ్చిన ఆబాలగోపాలాన్నీ చూసి సంతోషంతో ఉప్పొంగుతున్నట్టు కడలి కెరటాలతో ఎగిరెగిరి గెంతుతుంది. హోరుతో కేరింతలు కొడుతుంది. మచ్చికైన పెంపుడు జంతువు పాదాలను నాకితే వచ్చే మమకారంలాంటిదే.. నెమ్మదించిన అలలు కాళ్లను చల్లగా తాకుతుంటే కలుగుతుంది. అయితే.. చాలామంది అలాంటి కడలిని ఏ వ్యర్థాన్నైనా పారేయదగ్గ డంపింగ్‌ యార్డులా పరిగణిస్తారు. తమను సేదదీర్చే కడలి తీరాన్నే చెత్తకుప్పగా భావిస్తారు. మరికొందరు బరి తెగించి.. మందు కొట్టే అడ్డాగా వాడుకుంటారు. అందుకు సాక్ష్యమే కాకినాడ బీచ్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు. తీరాన సుదీర్ఘరేఖలా పోగుపడ్డ చెత్తాచెదారం, ఇసుకలో పడి ఉన్న ఖాళీ మద్యం సీసాలు.. కొందరిలో పర్యావరణ, పౌరస్ప­ృహ బొత్తిగా లేదనడానికి నిదర్శనాలు. అంతేకాదు.. పర్యాటకాభివృద్ధికి కంకణం కట్టుకున్నామనీ, స్వచ్ఛతే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే పాలకులూ, అధికారుల అలసత్వానికీ గుర్తులు. ఇటు జనమూ, అటు అధికార, పాలకగణమూ చేస్తున్న నిర్వాకానికి సాగరతీరం ఇలా వికారంగా మారుతోంది.  
– ఫొటోలు : సతీష్‌ పేపకాయల, సాక్షి, కాకినాడ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement