ఫలితాల కోసం బీఈడీ విద్యార్థుల ధర్నా
ఫలితాల కోసం బీఈడీ విద్యార్థుల ధర్నా
Published Fri, Sep 30 2016 12:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఏఎన్‌యూ: పరీక్షా ఫలితాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన బీఈడీ విద్యార్థులు గురువారం యూనివర్సిటీ పరిపాలనా భవన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫలితాల విడుదలలో జాప్యం వల్ల తాము ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ మూడవ తేదీన తమకు పలు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయని బీఈడీ సర్టిఫికెట్లు లేకపోతే తాము ఆ అవకాశాలను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఈడీ సర్టిఫికెట్ల కోసం ఎన్నిసార్లు యూనివర్సిటీ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని సాదుల్లా హుస్సేన్ బీఈడీ కాలేజ్‌లో 2013–14, 2014–15 విద్యాసంవత్సరాల్లో 50 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్ పొంది కోర్సు చదివారు. వారి అడ్మిషన్లకు యూనివర్సిటీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి లేదని వారికి యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో కళాశాల యాజమాన్యంతో పాటు సాదుల్లా బీఈడీ కాలేజీలో 2014–15 బ్యాచ్‌లో బీఈడీ చదివిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి పరీక్షలు నిర్వహించమని యూనివర్సిటీకి సూచించింది. దానికి సంబంధించి ప్రభుత్వం జీఓను కూడా జారీ చేసింది. దాని ఆధారంగా ఆ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన యూనివర్సిటీ అధికారులు కళాశాల అఫ్లియేషన్ ఫీజు బకాయి ఉందని పరీక్షా ఫలితాలను నిలిపివేశారు. తరువాత పలితాలు విడుదల చేయమని కోర్టు సూచించింది. ఉన్నత విద్యాశాఖ కూడా జీఓను జారీ చేయడంతో ఫలితాల విడుదల అంశంపై యూనివర్సిటీ అధికారులు న్యాయ సలహా కోరారు. ఈ ప్రక్రియతో ఫలితాల విడుదల ఆలస్యం అవుతుండడంతో తమ ఫలితాలు విడుదల చేయాలని ఈనెల 26వ తేదీన ఇతర రాష్ట్రాల విద్యార్థులు యూనివర్సిటీకి వచ్చి ఉన్నతాధికారులను కోరారు. ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో గురువారం ధర్నాకు దిగారు. రిజిస్ట్రార్ కె.జాన్‌పాల్ విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఫలితాలు విడుదల చేస్తాం : రిజిస్ట్రార్
దీనిపై రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్‌ను వివరణ కోరగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం సాయంత్రంలోగా ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కళాశాల ఫీజుల చెల్లింపు తదితర అంశాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని ఓడీ( ఒరిజినల్ డిగ్రీ)లను నిలిపివేస్తామని తెలిపారు.
Advertisement