బీమా ధీమా ఇచ్చేనా? | beema dheema echena | Sakshi
Sakshi News home page

బీమా ధీమా ఇచ్చేనా?

Published Mon, Sep 26 2016 10:20 PM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

బీమా ధీమా ఇచ్చేనా? - Sakshi

బీమా ధీమా ఇచ్చేనా?

-కొబ్బరి చెట్లకూ ఇక బీమా
-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
-5 జిల్లాల్లో అమలు కానున్న పథకం
-జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సేద్యం
 
జంగారెడ్డిగూడెం : 
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల ఎక్కువగా కొబ్బరి పంటకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా కొబ్బరి తోటలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొబ్బరి తోటల సాగులో రాష్ట్రం నాలుగోస్థానంలో ఉంది. జాతీయ హార్టీకల్చర్‌ బోర్డు 2014 లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 121.9 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 1258.4 మెట్రిక్‌ టన్నుల కొబ్బరి ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంట తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు జిల్లాలో ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాల్లో కొబ్బరి బీమా పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సుమారు 55 వేల ఎకరాల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. 
 
బీమా చేసే ప్రక్రియ..
పెనువిపత్తులు లేదా సహజసిద్ధమైన నష్టానికి, అకస్మాత్తుగా కొబ్బరి మొక్కలు చనిపోవడం వంటి వాటికి, రీప్లాంటేషన్‌ చేసే సమయంలో నష్టాన్ని తగ్గించేలా బీమా సౌకర్యం కల్పించనున్నారు. బీమా పథకంలో నిర్దేశించిన ప్రదేశంలో ఆరోగ్యవంతంగా ఉండే కనీసం 5 మొక్కలు ఉండాలి. అరోగ్యవంతంగా ఉన్న మొక్కలు అన్నింటికీ బీమా చేయించాలి. పాక్షిక బీమా చెల్లుబాటు కాదు. అన్ని రకాలైన కొబ్బరి మొక్కలకు బీమా వర్తిస్తుంది. పొట్టిగా, హైబ్రీడ్‌ రకాలకు చెందిన చెట్లకు 4 నుంచి 60 సంవత్సరాల వయసు, పొడవుగా ఉండే చెట్ల రకానికి చెందిన 7 నుంచి 60 సంవత్సరాల మొక్కలకు బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వయసుకు సంబంధించి సంబంధిత రైతు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుం ది. తనిఖీ సమయంలో లోపాన్ని గుర్తిస్తే బీమాను నిలుపుదల చేస్తారు.
ఏ సందర్భాల్లో 
 
బీమా వర్తిస్తుందంటే..
పెను విపత్తులు సంభవించినా, అధిక వర్షాలు, పిడుగులు పడినా, వరదలు, అగ్నిప్రమాదం, చీడపీడలు, కరువు సమయాల్లో కొబ్బరి మొక్కలు చనిపోయినా లేక మొక్కలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయినా ఈ బీమా వర్తిస్తుంది. మొక్కలు వెంటనే చనిపోకపోయినప్పటికీ కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు లేదా ఉద్యానశాఖ మొక్కలు ఉత్పాదకత కోల్పోయినట్టుగా ధ్రువీకరణ ఇస్తే బీమా చెల్లించడం జరుగుతుంది. అయితే ఉద్దేశ పూర్వకంగా పంట విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, నిర్వహణ లోపం, జంతు, పక్షులు లేదా మనుషుల వల్ల పంట నాశనం అయితే, యుద్ధాలు, పోరాటాలు, కుట్రలు, విద్యుదాఘాతాలు తదితర వాటికి బీమా వర్తించదు. 
 
క్లెయిమ్‌ చేసుకోవడం ఇలా..
బీమా చేసిన కొబ్బరి చెట్లు చనిపోయినా లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయినా ఆ విషయాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఘటన జరిగిన 15 రోజులలోపు పూర్తి వివరాలతో తెలియజేయాలి. ఇన్సూరెన్స్‌ కంపెనీ తనిఖీ చేసేంతవరకు సంబంధిత చెట్లను తొలగించడం గానీ, తరలించడం గానీ చేయరాదు. అలాగే నష్టానికి సంబంధించి సీడీబీ లేదా ఉద్యానశాఖ ధ్రువీకరించాల్సి ఉంటుంది. బీమా ప్రతినిధి తనిఖీ చేసి ధ్రువీకరించిన 30 రోజులలోపు రైతుకు బీమా సొమ్ము అందుతుంది. 
 
ప్రీమియం ఇలా.. 
4 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సంవత్సరానికి రూ.9 ప్రీమియం చెల్లిస్తే రూ.900 బీమా లభిస్తుంది. 16 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సంవత్సరానికి రూ.14 ప్రీమియం చెల్లిస్తే రూ. 1,750 బీమా లభిస్తుంది. చెల్లించే ప్రీమియంలో కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తుంది. మిగిలిన 25 శాతం రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరించకపోతే రైతు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతు ఒకవేళ రెండు సంవత్సరాలకు ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే 7.5 శాతం, మూడు సంవత్సరాలకు ఒకేసారి చెల్లిస్తే 12.5 శాతం రాయితీ లభిస్తుంది. అయితే గరిష్టంగా మూడు సంవత్సరాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. బీమా చేసిన 30 రోజులలోపు చెట్లు చనిపోతే బీమా వర్తించదు. అయితే క్రమం తప్పకుండా రెన్యువల్‌ చేసిన చెట్లకు ఈ నిబంధన వర్తించదు. 
 
 దరఖాస్తు ప్రక్రియ
బీమాను నేరుగా కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (సీడీబీ)కి దరఖాస్తు చేసుకోవడం ద్వారా గానీ లేదా అధీకృత ఏజెంట్ల వద్ద గాని, ఉద్యానశాఖ ద్వారా గానీ, సీడీబీచే గుర్తింపు పొందిన కోకోనట్‌ ఉత్పత్తి, పెంపకందార్ల సొసైటీల ద్వారా గానీ దరకాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తుతో పాటు ప్రీమియం డీడీ, భూమి రికార్డు, అందులోని ప్లాంటేషన్‌ వివరాలను ధ్రువీకరిస్తూ రెవెన్యూ లేదా ఉద్యానశాఖ ఇచ్చిన ధ్రువీకరణపత్రం, ఆరోగ్యవంతమైన చెట్లకే బీమా చేస్తున్నట్టుగా రైతు ఇచ్చే స్వీయ ధ్రువీకరపత్రం, ప్లాంటేషన్‌కు సంబంధించి భూమి సర్వే నంబర్, భూమిలో వేసిన చెట్ల వివరాలతో కూడిన స్కెచ్‌ జత చేయాల్సి ఉంటుంది. రైతువాటా ప్రీమియం 25 శాతం డీడీ రూపంలో చెల్లించిన 30 రోజుల్లో బీమా ధ్రువీకరణపత్రం రైతుకు అందుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement