బ్యాక్టీరియాతో జాగ్రత్త!
- దానిమ్మలో సమగ్ర సస్యరక్షణ అవసరం 'మహానంది' ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం
దానిమ్మ తోటలు సాగు చేసిన రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వాటిలో బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రమాదకరమైనందున సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి నివారించుకోవాలని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో దానిమ్మ తోటలపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు, మరో శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పించారు.
రోగం లేని మొక్కలు ఎంపిక
ఇటీవల దానిమ్మ తోటలకు బ్యాక్టీరియా మచ్చతెగులు బాగా దెబ్బతీస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆకులు, కాండం, కాయలపై విస్తరించి తీవ్ర నష్టం కలిగిస్తున్నందన ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తెగులు నర్సరీల నుంచి, వర్షంతో కూడిన గాలులు ద్వారా, కత్తిరింపులు చేసే సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇందుకోసం పంట పెట్టాలనుకున్నపుడే రోగ రహిత మొక్కలు ఎంపిక చేసుకోవాలి. నర్సరీల్లో మొక్కల ఆకులు, లేత కొమ్మలపై నీటితో తడచినట్లు మచ్చలు కనిపిస్తే రోగం ఉన్నట్లుగా గుర్తించాలి. టిష్యూకల్చర్ మొక్కలు బాగున్నా వాటిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కత్తిరింపుల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కత్తిరించే ప్రతిసారీ కత్తెరలను డెటాల్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి శుభ్రం చేసుకోవాలి.
సమగ్ర సస్యరక్షణ
కత్తిరింపుల తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి. కొత్త ఆకులు వచ్చిన తర్వాత మూడు గ్రాములు శాలిసిలిక్ యాసిడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే కాయ ఊరేదశలో కూడా శాలిసిలిక్ యాసిడ్ నెల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులుకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే 25 గ్రాములు బ్లైటాక్స్ + 5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ + 5 గ్రాములు బ్యాక్టీరొనాల్+ జిగురు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేత ఇగుర్లు వచ్చిన తర్వాత 2 మి.లీ రీజెంట్ ఒక లీటర్ నీటికి లేదా 3 గ్రాములు ప్రైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీనికి 2 మి.లీ వేపనూనె కలుపుకోవాలి. కాయలపై శిలీంధ్రపు మచ్చ తెగులు కనిపిస్తే గ్రాము బావిస్టన్ లేదా 2.5 గ్రాములు ఎం–45 లేదా 1 మి.లీ టిల్ట్ లేదా 1 మి.లీ స్కోర్ లేదా 2 గ్రాములు అవతార్ లేదా 2 గ్రాములు మిర్జ్ మందులు 20 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోగ లక్షణాలు కనిపించిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు, మొక్కలు పీకేసి కాల్చివేయాలి. తోటలను ఎపుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకుంటే దానిమ్మ రైతు ఇంట ప్రధాన వాణిజ్యపంటగా లాభదాయకంగా మారుతుంది.