భళారే జానపదం
ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, రూపకాలు ఆహూతులను అలరించాయి. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలులో జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు అనంతపురానికి చెందిన కళాకారులు తరలి వచ్చి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ప్రేక్షకుల చేత భళారే అనిపించారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళానికి చెందిన కళాకారులు, నగరానికి చెందిన నాట్యాచార్యులు డి.హేమసుందర్, గండికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. తాడేపల్లి గూడెం, జంగారెడ్డిగూడెంలకు చెందిన కళాకారులు ఇచ్చిన బుర్రకథ, కోలాటం, పల్లెసుద్దులు ప్రదర్శనలు ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నాయి. దూబచర్లకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కంజరి కథ, తాడేపల్లిగూడెంకు చెందిన కళాకారుల బుడబుక్కల వేషధారణల ప్రదర్శన అద్భుతంగా సాగాయి. పాలకొల్లుకు చెందిన కళాకారుల గరగాట ప్రదర్శన అలరించింది. అనంతరం కళాకారులను జిల్లా జానపద కళాకారుల సంఘం సత్కరించింది. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు, జిల్లా అధ్యక్షుడు దువ్వి రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.హేమ సుందర్, ప్రముఖ శిల్పి దేవికా రాణి ఉడయార్, చప్పిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
– ఏలూరు(ఆర్‌ఆర్‌పేట)