ఆ నలుగురే ఏలుతున్నారు | bhatti vikramarka fired on trs governament | Sakshi
Sakshi News home page

ఆ నలుగురే ఏలుతున్నారు

Published Sat, Jun 4 2016 3:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

ఆ నలుగురే ఏలుతున్నారు - Sakshi

ఆ నలుగురే ఏలుతున్నారు

పేదల ఇళ్లను కూల్చి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది
టీఆర్‌ఎస్‌కు పేదల ఉసురు తగులుతుంది
పేదోడు తిండిగింజలు లేక ఏడుస్తుంటే..
పాలకులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క

తెలంగాణలో మళ్లీ దొరల పాలనే వచ్చిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లోని కాలనీలన్నింటినీ గ్రామకంఠంగా గుర్తించాలని దీక్షకు దిగిన వార్డు సభ్యులకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పేదల బతుకులు మారుతాయని సోనియాగాంధీ రాష్టాన్ని ప్రకటించారన్నారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతోందన్నారు.

జవహర్‌నగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడే ఏలుతున్నారని పీసీసీ కార్యనిర్వాహణ అధ్యక్షు డు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని.. దీనిపై పేదలంతా ఐక్యంగా తిరగబడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం శామీర్‌పేట మండలం  జవహర్‌నగర్‌లో వార్డు సభ్యుల ఆమరణ దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. జవహర్‌నగర్‌లోని అన్ని కాలనీ లను గ్రామకంఠంగా గుర్తించాలని వార్డు సభ్యు లు మూడు రోజులుగా చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ పేదలను ఇబ్బందులు పెడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుందన్నారు. ప్రభు త్వ భూమిలో పక్కా ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు చట్టబద్ధంగా పట్టా పొందే హక్కు ఉందని అన్నారు. పేదోడు తిండిగింజలు లేక ఏడుస్తుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయ లు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే సహించేదిలేదన్నారు. వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసి సౌకర్యాలు కల్పించే వరకు తమ పోరాటం ఆపేది లేదన్నారు. జవహర్‌నగర్ భూములు ప్రభుత్వానివి కావని..

అవి మాజీ సైనికుల భూములన్నారు. జవహర్‌నగర్ ప్రభు త్వ భూములే అయితే జీఓ 58,59 ప్రకారం ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించారు. జవహర్‌నగర్ ప్రజలకు అన్యా యం జరిగితే రెండు లక్షల మందితో కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జవహర్‌నగర్‌లోని అన్ని ఇళ్లను క్రమబద్ధీకరించి గ్రామకంఠంగా గుర్తించేవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. టీపీసీపీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నంబర్ వన్ అని అన్నారు. ఇటీవల కాలంలో పెద్దపెద్ద కటౌట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ అని ప్రకటనలు చేస్తున్నారన్నారు.

వాస్తవంగా ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వనే అని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. 25 రోజులుగా సమస్యను పరిష్కరించాలని దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో వారి పాలన ఏంటో అర్ధమైందన్నారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని కేసీఆర్ అక్కరకు రాని జీఓలను తీసుకువస్తూ పేదలను మోసం చేస్తున్నారన్నారు.

అనంతరం బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లే ష్, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ కాలేషా, మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, నాయకులు వి.సుదర్శన్, గోనె మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement