
అఖిల x ఆది
నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్‌గా శిల్పామోహన్‌రెడ్డి అనుచరుడు సిద్ధం శివరాం ఏడాదిన్నరపాటు కొనసాగారు.
♦ నంద్యాల టీడీపీలో ముసలం
♦ ఎవరికి వారే మార్కెట్‌యార్డు చైర్మన్ కోసం పట్టు
♦ భూమా మాట ఇచ్చిన వారికేనంటున్న మంత్రి అఖిల
♦ తన అనుచరులకు ఇప్పించేందుకు మంత్రి ఆది ప్రయత్నం
♦ సీఎం హామీ ఇచ్చారంటున్న మాజీ కౌన్సిలర్ చింతల
♦ ఎటూ తేల్చలేకపోతున్న టీడీపీ అధిష్టానం
నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి టీడీపీలో చిచ్చురేపింది. నంద్యాల ఉప ఎన్నికలో ఓట్ల కోసం ఎవరికి వారే హామీచ్చారు. ఉప ఎన్నికలో గెలుపు అనంతరం తాము హామీ ఇచ్చిన వారికే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది.
నంద్యాల: నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్‌గా శిల్పామోహన్‌రెడ్డి అనుచరుడు సిద్ధం శివరాం ఏడాదిన్నరపాటు కొనసాగారు. దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి టీడీపీలో చేరాక సిద్ధం శివరాం పదవీ కాలాన్ని పొడిగించకుండా అడ్డుకొని తన వర్గీయులకు ఇప్పించుకోవాలని సిఫార్సు లేఖలు ఇచ్చారు. దీంతో ఏడాది కాలంగా నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. కడప జాయింట్ కలెక్టర్ సుధాకర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పదవి ఆశ చూపి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నాయకులు ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికలు ముగి..టీడీపీ అభ్యర్థి గెలవడంతో పదవి విషయంలో విభేదాలు తలెత్తాయి. ఎవరికి వారే పదవి తమకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.
భూమా అనుచరులు.. శీలం భాస్కరరెడ్డి, మునగాల లక్ష్మీకాంతరెడ్డిలకు చైర్మన్ పదవిపై హామీ ఇచ్చారు. మంత్రి అఖిలప్రియ కూడా వీరివైపే మొగ్గు చూపుతున్నారు. వీరిద్దరిలో ఒకరిపేరును ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి పంపారు. అయితే ఉప ఎన్నికలో మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి.. కానాల గురునాథరెడ్డి, సాయినాథరెడ్డిలకు చైర్మన్ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. తమకు భూమా కుటుంబంతో పాటు మంత్రి ఆది అండదండలు ఉన్నాయని, తమకే పదవి వస్తుందని వీరు తమ అనుచరులకు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్.. తమ వర్గానికి చెందిన శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ యాతం జయచంద్రారెడ్డి, మహానంది మాజీ దేవస్థానం చైర్మన్ కంచెర్ల సురేష్‌రెడ్డిలను ప్రతిపాదించినట్లు సమాచారం.
సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు.. సీఎం చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, తనకే పదవి వస్తుందని పేర్కొంటున్నారు. ఎన్నికల ముందు తాను సీఎంను కలిశానని, నంద్యాలలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున తన అనుభవం దృష్ట్యా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని కోరినట్లు కాపు డైరెక్టర్ రామచంద్రారావు చెబుతున్నారు. ఈ విషయమై.. ఈనెల 6వ తేదీన బలిజ సంఘం ఆధ్వర్యంలో సీఎంను కలువబోతున్నట్లు తెలిపారు. ఎవరికి వారు మార్కెట్ యార్డ్ చైర్మన్‌పై ఆశలు పెంచుకున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చకపోతోంది.