సాక్షి ప్రతినిధి, కడప: మంత్రి ఆదినారాయణరెడ్డిపై జిల్లాలో తెలుగుతమ్ముళ్లు ముప్పేటదాడి చేస్తున్నారు. రోజురోజుకు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఎమ్మెల్యే జయరాములుతో మొదలైన ఆగ్రహజ్వాల క్రమేపీ కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఫైర్ అయ్యారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి వైఖరిపై విరుచుకుపడుతున్నారు. జిల్లాలో టీడీపీని బలోపేతం చేయాల్సింది పోయి మంత్రి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని ఆపార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అనైతికతకు నిలువుటద్ధంగా, అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిగా, మాటపై నిలకడ లేని తత్వం కల్గిన వారు ఎవరైనా ఉన్నారంటే...అది మంత్రి ఆదినారాయణరెడ్డి మాత్రమేనని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
అలాంటి నేత జిల్లా టీడీపీలో తన పెత్తనం కోసం ఆరాటపడుతోండడంపై సర్వత్రా విమర్శలు అధికమవుతున్నాయి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేల్‌లో తనలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జయరాములు, అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతి ఇరువురు సంయుక్తంగా ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటివారిని పోత్సహించి,అవసరమైతే వర్గవిభేదాలను తొలగించే ప్రక్రియ చేపట్టాల్సిందిపోయి, నియంతృత్వ ధోరణితో మాజీఎమ్మెల్యే విజయమ్మ సూచించిన వారికే పార్టీ టికెట్ కేటాయిస్తామంటూ మంత్రి ప్రకటన చేశారు. దాంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే జయరాములు మంత్రిపై రెచ్చిపోయారు. నాలాగా నీవు కూడా టీడీపీలో వలసవాదివే, అదృష్టం బాగుండీ మంత్రి అయ్యావు, పార్టీ టికెట్లు కేటాయింపు వ్యవహారంలో నీ తాహతు ఏమిటీ? అంటూ నిలదీశారు.
మరోవైపు జమ్మలమడుగు టికెట్ నాదే అంటూ ఆది ప్రకటించారు. అప్పటి వరకు మౌనంగా భరిస్తూ వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రిపై విరుచకపడ్డారు. ఎప్పటిలాగే దేవగుడి కుటుంబంతో ఉన్న రాజకీయ వైరం కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆదివారం మంత్రి వైఖరిపై ధ్వజమెత్తారు. నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణరెడ్డి టికెట్ల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? ఏ జిల్లాలో లేని గొడవలు ఇక్కడ ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులు సైతం మంత్రిపై గుర్రుగా ఉంటున్నారు. కనీస పరిగణలోకి తీసుకోకుండా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిని ప్రోత్సహిస్తున్నారని వారు వాపోతున్నట్లు సమాచారం.
షేమ్...షేమ్...
నియోజకవర్గాలల్లో మినీ మహానాడు నిర్వహించి ఆ తర్వాత జిల్లా స్థాయి మహానాడు చేపట్టాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండుసార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చేపట్టగా, ఆదివారం మంత్రి ఆదినారాయణరెడ్డి నిర్వహించారు. ఎవ్వరికి వారుగా వారివారి అనుచరులతో మినీ మహానాడు చేపట్టడంపై టీడీపీలో దుమారం రేపుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. మరోవైపు కొండాపురంలో ఎంపీ సీఎం రమేష్ కార్యాలయాన్ని పగలగొట్టింది తామేనని బహాటంగా మంత్రి ఆది వ్యాఖ్యానించారు. ఎంపీ, ఎమ్మెల్సీలను దూషిస్తూ ప్రసంగం చేపట్టడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి. ఏకంగా ఎంపీ రమేష్ పద్ధతి మార్చుకోకపోతే కన్పిస్తే కాల్చివేత రోజు వస్తుందని హెచ్చరించారు. మంత్రి ప్రసంగం మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఎంపీ వర్గీయులు భగ్గుమంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అందులో కొనసాగుతోన్న కొందరు నాయకులు ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ అంటూ ఎంపీ సీఎం రమేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేరే సమయంలో అడ్డుకోవాల్సింది పోయి, మరింతగా ప్రోత్సహించి, మాజీ మంత్రి శివారెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారని పలువురు వివరిస్తుండడం విశేషం.
అధ్యక్షుడి మాట ఖాతరుచేయని శ్రేణులు....
జిల్లా తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాటను ఆపార్టీ శ్రేణులు ఖాతరు చేయడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మలమడుగులో మినీ మహానాడు నిర్వహించరాదని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఫోన్‌లో స్వయంగా సూచించినా ఆయన లెక్కపెట్టలేదు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి ఫోన్‌చేసి మంత్రిపై ప్రెస్‌మీట్ పెట్టరాదని కోరినా ఆయన వినలేదు. ఇందుకు ప్రధాన కారణం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి ఊతకర్రలా అండగా నిలుస్తుండడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మంత్రి నియంతృత్వ వైఖరిని టీడీపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా నియోజకవర్గాలల్లోని పరిస్థితి వివరించి, అండగా నిలవకపోవడంతోటే అధ్యక్షుడు స్థాయిని గుర్తించడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment