బీహార్ దొంగల అరెస్ట్
బీహార్ దొంగల అరెస్ట్
Published Thu, Sep 14 2017 12:30 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
బంగారు గొలుసు, సెల్‌ఫోన్లు స్వాధీనం
నంద్యాల : మహిళను బెదిరించి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన బీహార్ దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్‌లో దొంగలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ కథనం మేరకు.. ఈ నెల 8న మహానంది మండలం అబ్బీపురంలో బీహార్‌కు చెందిన దేవేంద్రకుమార్, రాకేష్‌కుమార్ బంగారుకు మెరుగు పౌడర్ ఇస్తామని పావని అనే వివాహిత ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి కత్తితో బెదిరించి ఆమె మెడలోని 3.1 గ్రాముల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన తాలూకా సీఐ రామకృష్ణారెడ్డి, మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు నిందితులను అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారి నుంచి బంగారు గొలుసు, పల్సర్ బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దొంగలకు వేలల్లో జీతాలు..
బీహార్‌కు చెందిన కొందరు యువకులను ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసి వారికి నెలనెల వేతనాలు వారి ఖాతాల్లో జమ చేస్తారని డీఎస్పీ తెలిపారు. వీరి జీతం నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందన్నారు. కాని జీతం ఇచ్చేది ఎవరో వీరికే తెలియదని, కాని వారు చోరీ చేసిన సొమ్ము ఆ ముఠానాయకుడికి వెళ్తుందన్నారు. వీరు చోరీ చేసిన వెంటనే పక్కనున్న వ్యక్తికి ఇచ్చేస్తారని, సొమ్ము తీసుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయి ముఠా సభ్యులకు చేరవేస్తారన్నారు. పక్కాప్లాన్ ప్రకారమే చోరీలకు తెగబడతారని తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన వారిపై తెనాలి రూరల్‌లో, ఒజిలి, ఆత్మకూరు, ముత్తుకూరు‡, నెల్లూరు త్రీటౌన్‌లో పరిధిలో ఆరు చోరీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Advertisement