చోరీ జరిగిందంటూ లారీ లోడు మాయం
Published Sun, Jul 31 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
ఉంగుటూరు : చోరీ జరిగిందంటూ సుగణ బర్డ్ ఫీడింగ్ పరిశ్రమకు చెందిన లారీ లోడును అమ్మేసుకున్న మోసగాళ్లను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. చేబ్రోలు పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా, తాడేపల్లిగూడెంనకు చెందిన మహ్మద్, ఇక్బాల్, హుస్సేన్ అలియాస్ బాషా కొన్నేళ్ల నుంచి సొంతగా రెండు లారీలతో నేషనల్ లారీ సప్లయి ఆఫీస్ నడుపుతున్నారు. ఈ క్రమంలో కిరాయి నిమిత్తం ఏపీ 16 యూ 4851 అను నెంబరు గల తమ లారీని ఈ నెల 14న మహారాష్ట్రలోని వార్దా జిల్లా హింగన్ ఘాట్‌కు పంపించారు. అక్కడ గల సుగణ బర్డ్ ఫీడింగ్ పరిశ్రమ నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన 17 టన్నుల(321 బస్తాల) సోయా తవుడును లోడ్ చేయించారు. ఈ సరుకును శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద గల సుగుణ వారి గోడౌన్‌కు చేర్చాల్సి ఉంది. అయితే రణస్థలం వెళ్లవలసిన లారీని దారి మళ్లించి 17వ తేదీన తాడేపల్లిగూడెం రప్పించారు. లోడును మండపాకలోని ఓ పౌల్ట్రీఫారం యజమానికి రూ.5.20 వేలకు అమ్మేశారు. లోడ్ ఇచ్చిన సుగుణ కంపెనీ వారికి వెంకట్రామన్నగూడెం వద్ద సరుకు చోరీకి గురైందని చెప్పారు. ఈ నెల 26న సాయంత్ర చేబ్రోలు పోలీసుస్టేçÙన్‌కు డ్రైవర్‌ను తీసుకు వచ్చి తప్పుడు రిపోర్టు ఇప్పించారు. కేసు నమోదు చేసిన చేబ్రోలు ఎస్సై చావా సురేష్ దర్యాప్తు ప్రారంభించి తదనంతరం కేసును గణపవరం సీఐ దుర్గాప్రసాద్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేయగా మోసం బయటపడింది. నిందింతులు మహమ్మద్, ఇక్బాల్, హుస్సేన్ అలియాస్ భాషాలను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారని ఎస్సై చెప్పారు.
Advertisement
Advertisement