ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఉచితం
ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఉచితం
Published Tue, Nov 22 2016 6:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
త్వరలో ఏలూరులో సమావేశం
భీమవరం టౌన్:
ఇక జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఉచితంగా పొందేందుకు మార్గం సుగమం అవుతోంది. ఈ పత్రా జారీ మరింత సులభతరం, ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా డిసెంబర్ 1వ తేది నుంచి పొందవచ్చు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈనెల 24 తేదిన ఏలూరు నగరపాలక సంస్థను డీఎంఅండ్‌హెచ్‌వో కె.కోటేశ్వరి ఆధ్వర్యంలో జిల్లాలోని అందరు మునిసిపల్ కమిషనర్లు, ఏఎస్‌వోలు, హెల్త్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ డీఎంఎ కూడా రానున్నారు. నగర పాలక సంస్థలు, మునిసిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయనవసరం లేదు. త్వరలో ఇంటి వద్ద కూర్చుని ఆ ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. ఈ ధృవీకరణ పత్రాల నమూనా ఆన్‌లైన్‌లో ప్రత్యేక్ వెబ్‌సైట్‌గా పొందుపరచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నమూనా పత్రంలో వివరాలు నమోదు (రిజిస్ట్రేషన్) చేస్తే క్షణాల్ల పరిశీలిన జరుగుతుంది. సంబంధిత నమూనా ధృవీకరణ పత్రాలపై ముందుగానే మునిసిపల్ కమీషనర్ల డిజిటల్ సంతకాలు చేసి ఉంటాయి. రిజిస్ట్రేషన్ పరిశీలన అనంతరం జనన, మరణ ధృవీకరణ పత్రాలను సొంతంగానే ప్రింటౌట్ తీసుకునే సౌకర్యం కలగనుంది.
గతం, ప్రస్తుతం:
కాగిత రహిత పాలనలో భాగంగా ఇప్పటి వరకూ ఉన్న సాంకేతిక విధానంలో కూడా మార్పులు చేస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలు చేతిరాత విధానంలో అందచేసేవారు. జననం, మరణం జరిగిన వెంటనే సమాచారాన్ని మునిసిపల్ రికార్డుల్లో నమోదు చేస్తారు. దశాబ్దకాలంగా కంప్యూటరైజ్డ్ ధృవీకరణ పత్రాలను ఇస్తున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఈ పత్రాలను పొందే సౌలభ్యం ఏర్పడింది. అయితే పట్టణాలో జనన, మరణ వివరాలను తప్పనిసరిగా నగర, మునిసిపాలిటిలకు సమాచారం అందిచాల్సి ఉంది. ధృవీకరణ పత్రాలు పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంది.
సిఆర్ సిస్టం:
నగర పాలక సంస్థలు, మునిసిపాలిటిలో ప్రస్తుతం ఉన్న యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ (యుబిడి) సాఫ్ట్‌వేర్‌ను ఇప్పుడు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సిఆర్‌ఎస్)లోకి మార్పు చేస్తున్నారు. ఈ మేరకు నాలుగు నెలల క్రితం డైరక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (yì ఎంఎ) కె.కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల నిర్వహణను కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో మునిసిపాలిటిల్లో సాఫ్ట్‌వేర్ మార్పుకు శ్రీకారం చుడుతున్నారు.
భీమవరంలో ప్రయోగాత్మకంగా :
రాజమండ్రి రీజియన్ పరిధిలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో మొట్టమొదటిగా భీమవరం మునిసిపాలిటిలో సిఆర్‌ఎస్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. పూర్వ నుంచి రికార్డు పస్తుకాల్లో ఉన్న జనన, మరణ వివరాలను స్కాన్ చేసి కంప్యూటరీకరణ చేశారు. ఆ తరువాత సిఆర్‌ఎస్ సిస్టంలో వీటిని పొందుపరుస్తారు.
ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో:
గతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇంటి వద్ద ప్రసవం జరిగినా, మరణించినా ఆ సమాచారాన్ని మునిసిపాలిటికి తెలిపి రికార్డుల్లో నమోదు చేయించాలి. ఈ ఏడాది మే 1వ తేది నుంచి ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రుల్లో జనన, మరణాల సమాచారం మునిసిపాలిటిలకు తెలపాల్సిన అవసరం లేకుండానే సంబంధిత ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు) ఆసుపత్రుల వద్దే అందిస్తున్నారు. శిశువులకు ఆధార్ నంబర్ కూడా కేటాయింపు జరిగిపోతుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం జనన, మరణ సమాచారాన్ని మునిసిపాలిటిలకు తెలపాల్సి ఉంది.
ఉచితం:
ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, పిహెచ్‌సిలో జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా పొందవచ్చు. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిల్లో సిఆర్‌ఎస్ సిస్టం అమలులోకి వచ్చాక ఇళ్ల వద్ద నుంచి ఆన్‌లైన్‌లో ఆ పత్రాలను ఉచితంగా పొందే సౌలభ్యం త్వరలోనే కలగనుంది.
Advertisement
Advertisement