టీడీపీతో పొత్తుపై అసంతృప్తి ఉంది
- ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు
- పొత్తుపై నాడు, నేడు కార్యకర్తలు సంతృప్తిగా లేరు
- సొంతంగా ఎదగడానికి వ్యూహం
- కేంద్రం చేసిన సాయం గురించి చెబుతున్నా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతే ఎలా?
- అభివృద్ధిని వికేంద్రీకరించాలి
‘రాష్ట్రంలో 1999 ఎన్నికల్లోనూ 2014 ఎన్నికల్లోనూ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డాం. ప్రధానంగా 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తును బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. ఇప్పుడూ కార్యకర్తల్లో అదే భావన ఉంది. ఇక ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోం. రాష్ట్రంలో సొంతంగా ఎదగడానికి నలుగురు సభ్యులతో పార్టీ అధిష్ఠానం కమిటీ వేసింది’ అని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు వెల్లడించారు. తాజా రాజకీయ పరిస్థితులపై ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇవీ..
- సాక్షి, హైదరాబాద్
ప్రశ్న:1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో పొత్తును తెంచుకున్నారు.. మళ్లీ 2014లో పొత్తు పెట్టుకున్నారు. 1999 ఎన్నికలకు ముందు వాజ్‌పేయి.. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ ప్రభంజనం స్పష్టంగా కన్పించినా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ఎదగలేకపోయింది కదా?
జవాబు: దేశ అవసరాల దృష్ట్యా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తును బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. కానీ.. బీజేపీ త్యాగం చేసింది. 2014 ఎన్నికల్లో విజయనగరం సభలో బీజేపీతో పొత్తు రద్దు చేసుకుంటామని చంద్రబాబు ప్రకటించినప్పుడు.. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసేందుకు బీజేపీ సిద్ధమైంది. కానీ చంద్రబాబు సర్దుకున్నారు. బీజేపీ సొంతంగా పోటీ చేసి ఉంటే.. ప్రస్తుతం ఉన్న రెండు లోక్‌సభ, నాలుగు శాసనసభ స్థానాలకన్నా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవన్నది నిర్వివాదాంశం. రాష్ట్రంలో సొంతంగా బలపడేందుకు బీజేపీ వ్యూహాన్ని రూపొందించింది. నాతోపాటు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డిలతో కలిసి అధిష్టానం ఓ కమిటీ వేసింది. ఇప్పటికే ఐదు జిల్లాల్లో కమిటీ సభ్యులతో కలిసి పర్యటించాం. బీజేపీ సొంతంగా ఎదిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోం.
ప్ర: అమరావతి శంకుస్థాపనకు ముందు.. ఆ తర్వాత టీడీపీ-బీజేపీల మధ్య విమర్శలు అధికమైనట్లున్నాయి కదా?
జ: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం రూ.రెండు లక్షల కోట్లు ఇస్తుందంటూ ఓ సారి.. రూ.1.50 లక్షల కోట్లు ఇస్తుందంటూ మరో సారి కొన్ని పత్రికల్లో కొందరు నేతలు వార్తలు రాయించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అమరావతి శంకుస్థాపన సభలో పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను తుచ తప్పకుండా అమలు చేస్తామని.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టీకరించారు. కానీ.. ప్రధాని ప్రసంగం తనను అసంతృప్తికి గురిచేసిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అనడంలో మర్మమేమిటి? ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు మెలేయడం.. తొడలు కొట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇంద్రధనుష్ పథకం ప్రచార పోస్టర్లలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముద్రించకపోవడాన్ని ఏమనుకోవాలి? వీటిని ప్రశ్నిస్తే.. వారిపై విమర్శలు చేస్తున్నామంటూ టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేయడం ఏ మేరకు సబబు? అలాగే ప్రత్యేక హోదాకన్నా రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. రాాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని మేం ప్రస్తావిస్తుంటే.. మాపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు అనడంలో ఏమైనా అర్థం ఉందా?
ప్ర: అభివృద్ధిని వికేంద్రీకరించాలని బీజేపీ అంటోంది. సీఎం చంద్రబాబు మాత్రం అమరావతి చుట్టూ అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ఇది ఘర్షణకు దారితీయదా?
జ: హైదరాబాద్‌లో అభివృద్ధిని కేంద్రీకరించడం వల్లే 13 జిల్లాల్లో సమైక్యవాదం బలపడిన మాట వాస్తవం కదా? మళ్లీ ఆ తప్పును చేయకుండా.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నది బీజేపీ సిద్ధాంతం. అభివృద్ధిపై ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అసంతృప్తి ఉంది. ప్రధానంగా రాయలసీమలో తాగడానికి నీళ్లు లేవు. పట్టిసీమపై ఎంత పట్టుదలగా ఉన్నారో అదే పట్టుదలతో పోలవరం, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతున్నాం.
ప్ర: టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ చేరింది. బీజేపీ మంత్రులు పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం లేదనే విమర్శలపై మీరేమంటారు?
జ: మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులు ఏం మాట్లాడుతున్నారన్నది అంతర్గత అంశం. బీజేపీ నేతలు అంశాల వారీగా.. సిద్ధాంతపరంగా స్పందిస్తున్నారు.
ప్ర: రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా త్వరలో మీరు బాధ్యతలు స్వీకరించబోతున్నారనే ప్రచారం ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
జ: అధ్యక్షుణ్ని బీజేపీ అధిష్ఠానం నియమిస్తుంది. పార్టీని బలోపేతం చేయడానికి అధ్యక్ష పదవి ఉండాల్సిన అవసరం లేదు. కార్యకర్తగా కూడా పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయవచ్చు. రాష్ట్రంలో బీజేపీని ప్రబల రాజకీయశక్తిగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నాం.