జలసోయగం..మది పరవశం
ఆహ్లాదాన్ని పంచుతున్న
సంగమేశ్వర పడవ ప్రయాణం
పాపికొండలు బలాదూర్
దాల్ సరస్సును మరిపించే అందాలు
కనువిందు చేసే జలపాతాలు
డాల్పిన్‌నోస్‌ల ఆవిష్కారం
వినూత్నమైన రాతి అమరికలు
సహజ జలపాతాలు..అరుదైన వన్యప్రాణులు.. ఎత్తయిన కొండలు... ప్రకృతి సోయగాలను తిలకిస్తూ పడవలో సాగే ప్రయాణం మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. హŸయలొలికే నీటి అలలు..రయ్యిన ఎగురుతూ విన్యాసాలు చేసే పక్షులు.. నీళ్లలో జలతారు మీనాల నృత్య సోయగాలు...చిక్కటి అడవులు.. ప్రకృతి చెక్కిన రాతి శిల్పాలు.. ఆ వాతావరణం చూపరులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఓ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. మదినిండా ఆనందాన్ని పంచుతుంది. ఇలాంటి అనుభవమే మీకూ కావాలంటే సంగమేశ్వరం వెళ్లాల్సిందే. అక్కడ బోటింగ్‌లో షికారు కొట్టాల్సిందే.
ఆత్మకూరు రూరల్
నల్లమల పర్వత ్రÔó ణి రెండు వరసల్లో ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాలను వేరు చేస్తూ లోతైన లోయల గుండా కృష్ణమ్మ బంగాళాఖాతాన్ని చేరుకునేందుకు పరుగులు తీస్తూ ఉంటుంది. శ్రీశైలం వద్ద ప్రాజెక్ట్ నిర్మించడంతో రిజర్వాయర్ వెనుకతట్టు జలాలు 60 కిమీ మేర విస్తరించి మైదాన ప్రాంతంలో విశాలమైన కృత్రిమ సరస్సును తలపిస్తున్నాయి. ఈ సరస్సు నల్లమల కొండల్లో అద్భుత ప్రాకృతిక శోభకు మెరుగులు దిద్దింది. ఒకప్పుడు మావోలు వారి కోసం వెళ్లే పోలీసులు, చేపలవేటలో నిమగ్నమయ్యే జాలర్లు తప్ప అంతదూరం నల్లమల కొండల నడుమ కృష్ణమ్మతో కలిసి ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. దీంతో అద్భుతమైన ప్రకృతి శోభ బయటి ప్రపంచానికి ఆవిష్కృతం కాలేదు.
కృష్ణా నది నల్లమల కొండలను ఒరుసుకుంటూ ఒక చోట నాతి నడుముకంటే సన్నగానూ మరో చోట కశ్మీర్ లోని దాల్ సరస్సు కంటే విశాలంగానూ ప్రవహిస్తూ సందర్శకులకు అలౌకికానందం కలిగిస్తోంది. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణా రాష్ట్రలగుండా మైదాన ప్రాంతాన్ని అధిగమించి కర్నూలు – మహబూబ్ నగర్ జిల్లలాల సరిహద్దుల్లో సోమశిల, సంగమేశ్వరం మధ్యనుంచి బిళ్వం కామాక్షమ్మ కొండ వద్ద నల్లమల పర్వత శ్రేణుల్లోకి ప్రవేశిస్తు్తంది. ఇక్కడ నుంచి రెండు రాష్ట్రాలలోని సిద్దేశ్వరం, జానాల, బలపాల తిప్ప, అమరగిరి, లింగమయ్యపెంట, మిరపకాయల పెంట, గుండ్లపెంట తదితర అటవీ గ్రామాలను స్పర్శిస్తు కృష్ణమ్మ నడక కొనసాగుతుంది. ఇలా 20 కి.మీ దూరం వెళ్లిన తరువాత నదిలో పచ్చదనం కుప్పపోసినట్లుగా చీమలతిప్ప కనపడుతుంది. విశాలమైన నదీ ప్రవాహంలో సహజంగా ఏర్పడ్డ చిరునదీ ద్వీపమే చీమల తిప్ప. ఇంకా సరిగా చెప్పాలంటే ఇది ఒక కొండ లంక. ఈ చీమలతిప్పపై బతుకు పోరులో వలసవచ్చిన విశాఖ జాలర్ల కుటుంబాలు నివాసముంటాయి. ఇక్కడ నివాసముండే జాలర్ల పిల్లలు చిన్న పడవల్లో నదిలో సరదాగా తిరుగుతూ ఆటలాడుకునే దృశ్యాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చీమల తిప్పను దాటిన తరువాత నల్లమల కొండలు కాస్త దూరంగా ఉండడంతో ఈ ప్రాంతంలో సహజంగానే విశాలమైన ప్రాంతంలో అందమైన సరస్సు ఏర్పడింది. ఇక్కడ చీమలతిప్ప చుట్టు లంగరు వేసిన పడవలను చూస్తే ఇది మనకు కశ్మీర్‌లోని దాల్ సరస్సును స్ఫురణకు తెస్తుంది.
పచ్చటి తీవాచీల నడుమ..
నల్లమల కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ ఒడిలోంచి మనం తలెత్తి చూస్తే ఎల్తైన కొండలను ఎవరో ఆకుపచ్చ తివాచీతో కప్పి ఉంచారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కొండలపై పెరిగిన సిరిమాను, నారయేపి, నల్లమద్ది, సోమి..తదితర వృక్షాలు మనకు పచ్చందాలను పరిచయం చేస్తాయి. నదిలోకి వాలి ఉండే పచ్చటి చెట్లు వనదేవతలు కృష్ణమ్మతో కరచాలనం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి.
డాల్ఫిన్‌హౌస్‌లు మనకూ ఉన్నాయి..
విశాఖ సముద్ర తీరంలో డాల్ఫిన్ ముక్కును పోలిన కొండ పర్యాటక ప్రాముఖ్యాన్ని పొందిన సంగతి తెలిసిందే. అలాంటి డాల్ఫిన్‌నోస్‌ను తలపించే కొండలు కష్ణమ్మను ఒరుసుకుంటూ నదీమార్గంలో ఎన్నో చోట్ల కనిపిస్తాయి. ఇలా కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు ఎన్నో అందాలను ఆవిష్కరిస్తూ తన పయనాన్ని సాగిస్తుంది. ఈ దారిలో ప్రసిద్ధి చెందిన అంకాళమ్మ కోట ఉండే పర్వతం కనిపిస్తుంది. పూర్వం దివిటీ దొంగలకు ఈ కోట ఆశ్రయదుర్గంలా ఉండేదని అంటారు.
రాళ్ల అమరిక అదుర్స్
నదిలో ప్రయాణిస్తూ చుట్టు కనిపించే నల్లమల పర్వత శ్రేణిని పరిశీలిస్తూ వెళుతుంటే ఎన్నో అద్భుతమైన రాతి అమరికలు కనిపిస్తాయి. కోట గోడలు, వాటి మధ్య బురుజులు ఉన్నట్లుగాను, మరొక చోట ఏనుగు కాళ్లు పైకెత్తి తొండం లేపి ఘీంకరిస్తున్నట్లుగాను, మరో చోట ఇరువురు వ్యక్తులు ఆలింగనం చేపుకున్నట్లుగా రాళ్లు కనిపిస్తాయి.
జలపాతాల సోయగం..
నల్లమల అడవుల్లోంచి పప్రవహించే కొండవాగులు, ఎల్తైన కొండల మీదనుంచి కృష్ణా నదిలోకి దూకుతూ ఏర్పరచే జలపాతాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇలాంటి జలపాతాలు కృష్ణమ్మ నల్లమల కొండల్లో ప్రవహించినంత మేర చాలా చోట్ల కనిపిస్తాయి.
పులుల అభయారణ్యం..
కృష్ణానది నల్లమలలో ప్రవహించే ప్రాంతమంతా నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోనే ఉంది. దీంతో కృష్ణానదిలో ప్రయాణించే వారికి నది ఒడ్డున సంచరించే పెద్ద పులులు కనిపించే అవకాశం ఉంది. అంతే కాకుండా పొడదుప్పి, కణితి, కొండ గొర్రె వంటి గడ్డతినే జంతువులు కనిపిస్తాయి.
ప్రయాణమెలా..
నిజానికి ఇంతటి అందమైన ప్రదేశాలు రాష్ట్రంలో అరుదుగానే ఉన్నాయి. కృష్ణానదిలో ప్రయాణం కొంత సాహసంతో కూడుకొన్నదే అయినా ఎంతో ఆహ్లాదాన్ని మిగులుస్తుంది. నదిలో జాలర్ల నుంచి చేపలు సేకరించేందుకు ఉపయోగించే ఇంజన్‌బోట్లు ఈ సాహసయాత్రకు ఉపకరిస్తాయి. తెలంగాణా రాçష్ట్ర పర్యాటక శాఖ మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపురం సమీపంలో ఉన్న సోమశిల వద్ద నుంచి నదిలో ప్రయాణించేందుకు బోటును అందుబాటులో ఉంచింది. ఇక్కడ ఆ శాఖకు చెందిన హోటల్ కూడా ఉంది. అలాగే కృష్ణా పుష్కరాల సంధర్భంగా సంగమేశ్వరంలో ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఇక్కడ నాలుగు వీఐపీ ఏసి లాంజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపి టూరిజానికి చెందిన ఆరు సీట్లు, ఎనిమిది సీట్ల రెండు స్పీడ్ బోట్లు కూడా సంగమేశ్వరంలో పర్యాటకుల సౌకర్యార్థం ఉన్నాయి.
ఇలా వెళ్లాలి..
కర్నూలు నగరం నుంచి ఆత్మకూరుకు 70 కిమీ దూరం ఉంది. ఆర్టీసీ ప్రతి పది నిముషాలకు ఒక బస్సును తిప్పుతోంది. ఆత్మకూరు నుంచి ఆర్టీసీ బస్సుల్లోకాని ప్రయివేటు వాహనాల్లో కాని 40 కిమీ దూరంలోని కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వరం చేరుకోవచ్చు. స్వంత వాహనాలు ఉన్న వారు పాములపాడు మండలంలోని కంబాలపల్లె నుంచి నేరుగా కొత్తపల్లె మండలం లింగాపురం గ్రామం గుండా సంగమేశ్వరం చేరుకోవచ్చు.
త్వరలో సంగమేశ్వరం నుంచి
సంగమేశ్వరం నుంచి కూడా శ్రీశైలానికి పడవ ప్రయాణం త్వరలో ప్రారంభమవుతుంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాం. సంగమేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది.
– సుదర్శనరావు, డివిజనల్ మేనేజరు, ఏపీ టూరిజం, కర్నూలు
ప్రయాణికుల ఆసక్తిని బట్టి శ్రీశైలానికి బోటు
మహబూబ్ నగర జిల్లా సోమశిల నుంచి తెలంగాణా టూరిజం శాఖ ఒక బోటును శ్రీశైలానికి నడుపుతోంది. ఇందుకు రానుపోను టిక్కెట్ ధర రూ.800 నిర్ణయించాము. పిల్లలకు రూ.600 తీసుకుంటున్నాము. సింగిల్ వే ప్రయాణానికి రూ.500 నిర్ణయించాము. సోమశిల నుంచి శ్రీశైలం సుమారు 120 కి.మీ. దూరం నదిలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇందుకోసం టూరిజం బోటుకు 300 లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ప్రయాణికులు కనీసం 30 మంది ఉంటే రూ. 25 వేలు వస్తోంది. ఈ మేరకు ప్రయాణికులు బుక్ అయితే శ్రీశైలానికి బోటును ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రయాణంలో అక్కమహాదేవి గుహలను కూడా చూపిస్తున్నాం. అంతే కాకుండా సమీపంలో ఉన్న చీమల తిప్ప, అంకాలమ్మ కోట వంటి ప్రాంతాలకు కూడా బోటు నడుపుతున్నాం. ఇందుకోసం ప్రయాణ దూరం గంటల బట్టి రూ. 1000 వరకు చార్జ్ చేస్తున్నాం..
– సైదులు, జిల్లా మేనేజర్, తెలంగాణా టూరిజం, మహబూబ్‌నగర్