బోనాలకు ముస్తాభైన ఆలయాలు
పటాన్‌చెరు టౌన్ : పట్టణంలోని అమ్మవారి ఆలయాలు ఈ నెల 28న జరగనున్న బోనాల పండుగకు ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా పోచమ్మ దేవాలయాలకు రంగులు వేయడంతోపాటూ, భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. పట్టణంలోని జేపీకాలనీ, అంబేద్కర్‌కాలనీ, చైతన్య నగర్, ముదిరాజ్‌బస్తీ, తదితర ప్రాంతాల్లో మొత్తం 12 పోచమ్మ దేవస్థానాలు ఉన్నాయి.
ఈ దేవస్థానాల్లో జీహెచ్‌ఎమ్‌సీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను చేపట్టారు. కార్పొరేటర్ శంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయాల పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ఎక్కడెక్కైతే పోచమ్మ ఆలయాల ముందు భక్తులకు అసౌకర్యంగా ఉన్న మట్టి కుప్పలను కార్పొరేటర్ జేసీబీ సాయంతో తొలగింపజేశారు. అదేవిధంగా ఆలయాలకు ఇంకెమి ఏర్పాట్లు చేయాలో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పోచమ్మ బస్తీలో ఉన్న ఏడుగుళ్ల పోచమ్మ ఆలయానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కార్పొరేటర్ పర్యవేక్షించారు.
బోనాలపండుగ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాలయం ముందు భాగాన ర్యాంప్‌ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని, జీహెచ్‌ఎమ్‌సీ అధికారులను కోరారు. శుక్రవారం ఫలహారం బండి ఊరేగింపును ఘనంగా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ పట్టణంలోని 12పోచమ్మ దేవస్థానాల్లో బోనాల పండుగ ఘనంగా జరగనుందని, ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
దేవాలయాల వద్ద లైటింగ్‌వ్యవస్థను బుధవారం కల్లా పూర్తి చేయనున్నట్లు పేర్కోన్నారు. ఏడు గుళ్ల పోచమ్మ ఆలయానికి బోనాలు ఎత్తుకుని వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని, అందుకోసమే అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ బోనాల పండుగలో భక్తులు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బోనాల పండుగ అయిపోయిన మరుసటి రోజు అమ్మవారి ఊరేగింపును ముదిరాజ్‌బస్తీ, మార్కెట్ రోడ్, తదితర ప్రాంతాల్లో వైభవోపేతంగా చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.