ప్రసవంలోనే విరిగిన ఎముకలు
ప్రసవంలోనే విరిగిన ఎముకలు
Published Fri, Oct 28 2016 9:43 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- ఆడ శిశువుకు అరుదైన జబ్బు
– ఆసుపత్రిలోనే వదిలివెళ్లిన తల్లిదండ్రులు
– శిశు కేంద్రంలో సంరక్షణ
కర్నూలు(హాస్పిటల్): ప్రసవంలోనే విరిగిన ఎముకలతో ఓ ఆడ శిశువు ఈలోకంలోకి అడుగిడింది. అలాంటి శిశువును పెంచే స్థోమత లేదని భావించిన తల్లిదండ్రులు కష్టమైనా సరే పాపను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. చికిత్స అనంతరం పాపను వైద్యులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో గత నెల 26వ తేదీన ఓ ఆడ శిశువు అనాథగా కనిపించింది. ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రుల కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పాపను చిన్నపిల్లల వార్డులోని ఎన్‌ఐసీయూలో చేర్పించి చికిత్స చేయించారు. పాప కాళ్లు, చేతులు ఒంపులు తిరిగి, వాపుతో ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు వైద్యపరీక్షలు చేయించగా 'ఆస్టియో జెనెసిస్ ఇన్‌ఫరెఫెక్టా' అనే ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధి ఉన్న వారి ప్రసవ సమయంలో ఎముకలు విరిగిపోతాయని వారు నిర్ధారించారు. 15 రోజుల పాటు పాపకు వైద్యం అందించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా వారు స్థానిక సి.క్యాంపులోని శిశు కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం పాప ఆలనపాలనను శిశు కేంద్రంలోని ఆయాలే చూస్తున్నారు. కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో వస్తే పాపను అప్పగిస్తామని ప్రకటించారు.
బాధ్యులపై కేసు నమోదుకు ఎస్పీ ఆదేశం
ఎస్పీ ఆకె రవికృష్ణ శుక్రవారం శిశుకేంద్రానికి వెళ్లి ఆయాల సంరక్షణలోని శిశువు పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించే విషయమై వైద్యులతో మాట్లాడారు. పాపను అనాథగా వదిలివెళ్లిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావును ఆదేశించారు. ఎవరైనా బాలికలను పెంచలేనిస్థితిలో ఉంటే దగ్గరలోని పోలీస్‌స్టేషన్, ఐసీడీఎస్, ప్రభుత్వ శిశు విహార్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టప్రకారం బాద్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి, శిశు గృహ మేనేజర్ మెహతాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద ఉన్నారు.
Advertisement
Advertisement