విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలి
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచాలి
Published Tue, Nov 22 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలు
నన్నయ వర్సిటీ వీసీ ముత్యాలునాయుడు
నగరంలో పుస్తక ప్రియుల పాదయాత్ర
రాజమహేంద్రవరం కల్చరల్ : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఇకపై ఏటా పుస్తక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్టు, నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రాంగణం నుంచి పాదయాత్రను వీసీ ప్రారంభించారు. విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం తగ్గిపోయిందని, చదవాల్సిన పుస్తకాలు చదవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర వై.జంక్షన్ వరకూ వెళ్లి తిరిగి కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమెస్కో అధినేత విజయకుమార్, కన్వీనర్ డాక్టర్ టి.సత్యనారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీరామ్మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.
సాహితీవేత్తలు ఏరీ?
తెలుగువారి సాంస్కృతిక రాజధానిలో సాహితీ వేత్తలకు లోటు లేదు. మంగళవారం జరిగిన పుస్తకప్రియుల పాదయాత్రలో సాహితీవేత్తలు కనపడలేదు. తమకు ఆహ్వానాలు రాలేదని రచయితలు చెబుతుండగా, పంపామని నిర్వాహకులు తెలుపుతున్నారు. పుస్తక సంబరాల ప్రారంభానికి నాందిగా నిర్వహించవలసిన పాదయాత్ర,ను మూడు నాలుగు రోజులకు నిర్వహించడం సరికాదని పలువురు పుస్తక విక్రేతలు వ్యాఖ్యానించారు.
Advertisement