కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవ
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం
స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి
ఎమెస్కో అధినేత విజయకుమార్
రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే..
సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను.
నవలలకు ఆదరణ తగ్గింది
నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి.
కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం.
పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే.