
బ్రహ్మయ్యా.. చూడవయ్యా..!
బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు
♦ అడుగంటిన బ్రహ్మంసాగర్
♦ అయినా వదలని ఆర్టీపీపీ అధికారులు
♦ రిజర్వాయర్‌లో కాలువ తవ్వి తూములోకి నీటిని మళ్లించే యత్నం
♦ అదే జరిగితే స్థానికులకు గుక్కెడు తాగునీటి కీ గగనం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్ నుంచి బ్రహ్మంగారిమఠం మండలంలోని దాదాపు 70 గ్రామాలతోపాటు బద్వేలు మున్సిపాలిటీకి తాగునీరు, 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. 17.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్న ఈ రిజర్వాయర్‌లో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి రికార్డు స్థాయిలో 14 టీఎంసీల నీటిని నిల్వ ఉంచగలిగారు. అప్పటి నుంచి నేటి వరకు బ్రహ్మంసాగర్‌కు నీటి మళ్లింపులో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. బద్వేలు పట్టణానికి తాగునీరు అందించేందుకు సమీపంలో పంప్ హౌస్ నిర్మించినా నీరు అందించే స్థితిలో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీపీపీకి ఆగని సరఫరా
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పాదన కోసం నీరు, బొగ్గు ఎంతో అవసరం. ఆర్టీపీపీలో గతంలో బొగ్గు అధింగా వాడేవారు. మైలవరం జలాశయం నుంచి నీరు వాడుతూ మధ్యలో ఆ జలాశయం ఎండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఇందులో భాగంగా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 72 కిలోమీటర్ల పొడవున రూ.70 కోట్లతో పైపులైన్ ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా నీటిని మళ్లిస్తున్నారు. ప్రతి రోజు 25-40 క్యూసెక్కుల నీటిని ఆర్టీపీపీకి తరలిస్తున్నారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ కుడి కాలువలోకి నీటిని మళ్లించడానికి తూము సమీపంలో కాలువ తవ్వేందుకు రూ.8 లక్షలతో టెండర్లు పిలిచారు.
ఎడమ కాలువ తూము ఎండిపోయి ఇప్పటికే నెలలు గడుస్తోంది. కుడికాలువ తూము ద్వారా ప్రస్తుతం ఆర్టీపీపీకి నీరు అందిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ తూము ద్వారా కూడా నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఇందులోకి నీటిని మళ్లించడానికి ఆర్టీపీపీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇదే జరిగితే స్థానికులకు గుక్కెడు తాగునీరు కూడా దొరకదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బ్రహ్మంసాగర్‌లో మిగిలిన అరకొర నీటిని ఆర్టీపీపీకి తరలించకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.