మహానందీశ్వరస్వామి
మహా శివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రంలో జరిగే మహానందీశ్వరస్వామి, కామేశ్వరిదేవీల వివాహానికి పెళ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వరస్వామి హాజరై, కల్యాణం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక తిరిగి నంద్యాలకు రానున్నారు.
– 20న మహానందీశ్వరస్వామి ఉత్సవాల రాక
– 21న బయల్దేరనున్న బ్రహ్మనందీశ్వరస్వామి
నంద్యాల: మహా శివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రంలో జరిగే మహానందీశ్వరస్వామి, కామేశ్వరిదేవీల వివాహానికి పెళ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వరస్వామి హాజరై, కల్యాణం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక తిరిగి నంద్యాలకు రానున్నారు.ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
నవనంది క్షేత్రాల పాలకుడు బ్రహ్మనందీశ్వరస్వామి స్థానిక కోటావీధిలో ఉన్న బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయం కేంద్రంగా చేసుకొని నందన చక్రవర్తి నవనంది క్షేత్రాలను నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆయన హయాంలో ఏర్పాటైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రతి ఏడాది మహానంది క్షేత్రంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో స్వామి వారికి, అమ్మవారికి కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ కల్యాణానికి పెళ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వరస్వామి, పార్వతీదేవి అమ్మవారు వ్యవహరించనున్నారు. మహానందీశ్వరస్వామి సంప్రదాయబద్ధంగా కామేశ్వరిదేవీతో నంద్యాలకు వచ్చి బ్రహ్మనందీశ్వరుని, పార్వతీదేవి అమ్మవారిని కలిసి పెద్ద దిక్కుగా వ్యవహరించి, పెళ్లిని జరిపించాలని కోరడం, మరుసటి రోజు వారు బయల్దేరడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో పెళ్లి పెద్ద బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించడానికి 20వ తేదీన కామేశ్వరిదేవి సహిత మహానందీశ్వరస్వామి నంద్యాలకు రానున్నారు. మరుసటి రోజైన 21న బ్రహ్మనందీశ్వరస్వామి మహానందికి వెళ్లి.. 24వ తేదీ అర్ధరాత్రి కామేశ్వరిదేవి సహిత మహానందీశ్వరస్వామి కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక 28వ తేదీ బ్రహ్మనందీశ్వరస్వామి, మహానందీశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను నంద్యాలకు తీసుకొస్తారు. 29న గ్రామోత్సవం జరిగాక మహానందీశ్వరస్వామి విగ్రహాలను ఆలయ సిబ్బంది మళ్లీ మహానందికి తీసుకెళ్తారు. దీంతో మహానందీశ్వరస్వామి పెళ్లి తంతు ముగుస్తుంది.