పెళ్లింట విషాదం
వరుడు ఆత్మహత్య
ఐదు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు
లక్ష్మీపూజకు బంధువుల గైర్హాజరు
మనస్తాపంతో ఉరి వేసుకుని అఘాయిత్యం
గుంతకల్లు టౌన్ : మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపూజకు బంధువులు రాలేదని మనస్తాపానికి గురై వరుడు వీరేష్‌కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంతకల్లు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి తల్లి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజీవ్ కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు, విజయగౌరీ దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన వీరేష్‌కుమార్ క్రికెటర్. ఇతను కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా గిన్నిగెర అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే తన తండ్రి శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందడంతో వీరేష్ ఆ కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు.
23, 24 తేదీల్లో పెళ్లి..
వీరేష్‌కు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన జ్యోతితో వివాహం కుదిరింది. ఈ నెల 23, 24 తేదీల్లో గుంతకల్లు ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో గల తమిళ సంఘం ఫంక‌్షన్ హాల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. పెళ్లివేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం గురువారం రాత్రి తన ఇంట్లో లక్ష్మీపూజ నిర్వహించారు. ఈ పూజకు తన బంధువులెవ్వరూ హాజరుకాలేదు. ఈ విషయమై శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతూ సొంత బంధువులెవ్వరూ పూజకు రాకపోతే ఎలా అని తల్లి, చెల్లెతో చెబుతూ తీవ్ర మనస్తాపం చెందాడు. కొద్దిక్షణాలకే బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన వీరేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మాధ్యంలో చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసుకున్నారు.