నిందితుడు సోమేశ్వరరావు అరెస్టు చూపుతున్న పోలీసులు
మహిళల విక్రయ ముఠా అరెస్ట్
సత్యవేడు: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మహిళలను వ్యభిచార గహాలకు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళలను అక్రమంగా రవాణా చేసే ముఠాపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నెల 14వ తేదీన సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరం మండలం, తాటికాయలవారిపాళెంకు చెందిన ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు(33)ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణలో అతను మహిళలను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపించి అక్కడ వ్యభిచార కేంద్రాలకు విక్రయించే ముఠా ఏజెంట్‌గా తేలిందని తెలిపారు. ఇతను పెయింటర్‌గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలకు ఎరవేస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నైలోని రఫి, పాండియన్, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఏరియా ఏజెంటుగా ఉన్న ఏసుప్రేమ తదితరులు నెల్లూరు, గుంటూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పాంతాలకు చెందిన మహిళలను విదేశాలకు తరలించారని తెలిపారు. ఎస్.నగ సోమేశ్వరరావు అలియాస్ బాబు ఇప్పటి వరకు 10మంది మహిళలను మలేషియాకు పంపించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.