హత్యా.. ? ఆత్మహత్యా... ?
* మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలు
* సంఘటన స్థలంలో సినిమా టికెట్లు
నర్సంపేట : గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతిచెందిన సంఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించగా వారు హత్యకు గురయ్యారా.. ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని గమనిస్తే ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించకపోయినా హత్య చేసిన వ్యక్తులే ఆత్మహత్యలా చిత్రీకరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లిదండ్రులకు హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పిన బాలికలు అటు హాస్టల్‌కుగానీ, బంధువుల ఇంటికిగానీ చేరకుండా సంబంధం లేని గ్రామశివారులో గుట్టపైకి ఎందుకు వెళ్లారనే ప్రశ్న తలెత్తుతోంది. మృతదేహాల వద్ద నర్సంపేట జయశ్రీ థియేటర్‌లో సినిమా చూసినట్లు టికెట్లు లభించడం వల్ల వారి వెంట ఎవరు వెళ్లి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పలువురి పాత్రపై అనుమానం..
మారుమూల ప్రాంతంలో ఉన్న మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 420 మంది బాలికలు చదువుతున్నారు. నిత్యం నిఘా ఉంచాల్సిన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు ఆరోపణలు వచ్చాయి. ప్రియాంకకు జ్వరం రావడంతో నవంబర్ 6న స్వగ్రామానికి భూమికను తోడుగా ఇచ్చి పంపారు. వెంటనే ఇంటి నుంచి భూమికకు కూడా నవంబర్ 8న జ్వరం రావడంతో 8వ తరగతి చదువుతున్న గుగులోతు కల్పనను తోడుగా ఇచ్చి తండాకు పంపినట్లు డిప్యూటీ మ్యాట్రిన్ వీరమ్మ తెలిపారు. ఈ సమయంలో ఇద్దరు బాలికలను ఎవరిని కలిసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమమతున్నాయి.
ఇంటికి చేరుకున్న బాలికలు 15 రోజుల తర్వాత నవంబర్ 23న ఇంటి నుంచి హాస్టల్‌కని బయల్దేరిన వారు అక్కడికి వెళ్లకుండా వుల్లంపల్లిలోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. వురుసటి రోజు 24న అక్కడ నుంచి హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి బయల్దేరిన బాలికలు అదృశ్యమయ్యారు. ఈ క్రమంలోనే వారిని ఎవరైనా నమ్మించి తీసుకెళ్లారా... లేదా భయుపడి విద్యార్థులు ఎటైనా వెళ్లిపోయారా అనే చర్చ జరుగుతోంది.
ఖాదర్‌పేట శివారులోని గుట్టకు ఇద్దరు బాలికలే వెళ్లారా ? ఇంకెవరైనా వెళ్లారా ? అనే విషయం తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో ఉన్న అరలీటరు క్రిమిసంహారక మందు డబ్బాలో కొద్దిగానే ఖాళీ అయి ఉండటం, మృతదేహాలు పడి ఉన్నచోట మృతిచెందే మందు పొర్లినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడం, కూల్‌డ్రింక్స్‌తోపాటు ఫేస్‌క్రీంలు ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో ఎవరైనా కావాలనే హత్య చేసి ఉంటారా.. లేదా తల్లిదండ్రులకు భయుపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.